ప్రస్తుతం తెలంగాణలో టీఆర్ఎస్‌కు బీజేపీ ప్రత్యామ్నాయంగా ఎదిగిందని చెబుతూ కేసీఆర్‌ను గద్దె దించుతాం, ఆయన అవినీతిని బయటపెడతామని ప్రముఖ సినీ నటి, మాజీ ఎంపీ విజయశాంతి స్పష్టం చేశారు.
కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన విజయశాంతి సోమవారం జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్‌సింగ్ సమక్షంలో బీజేపీలో చేరుతూ తెలంగాణలో రేపు తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే అని భరోసా వ్యక్తం చేశారు. కేవలం తన కుటుంబం మాత్రమే బాగుపడాలనే స్వార్థం ఉన్న ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావును గద్దె దింపేది తామేనని ఆమె ధీమా వ్యక్తం చేశారు.
ఏడాది కిందటే బీజేపీలో చేరాలని అనుకున్నా అని చెబుతూ కేసీఆర్‌ను గద్దె దించడమే తన లక్ష్యం అని ఆమె ప్రకటించారు. పార్టీ ఏ బాధ్యతలు అప్పగించినా నిర్వహిస్తా అని వెల్లడించారు. తెలంగాణ ప్రజలు బాగు పడడమే తనకు ముఖ్యం అని చెప్పారు.
1998 జనవరి-26న బీజేపీలో తన రాజకీయ జీవితం ప్రారంభించానాని, తెలంగాణ కోసం చాలా కష్ట పడ్డానని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. అయితే కొందరు తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్నారని 2005లో ఆ పార్టీ నుంచి బయటికి వచ్చానని, ఆ తర్వాత తల్లి తెలంగాణ పార్టీ స్థాపించి అనేక సమస్యలపై పోరాటం చేశానని వివరించారు.
నిజానికి తాను 1998లోనే తెలంగాణ పోరాటం మొదలు పెట్టానని, టీఆర్‌ఎస్ కంటే ముందు తాను తెలంగాణ ఉద్యమంలో భాగమయ్యానని ఆమె పేర్కొన్నారు. కేసీఆర్ తన కుటుంబమే ఉద్యమంలో ఉండాలనుకున్నారని ఆమె ధ్వజమెత్తారు. తనపై వత్తిడి తెచ్చి తన పార్టీని టీఆర్‌ఎస్‌లో విలీనం చేయించి, జులై, 2013లో తనను పార్టీ నుండి బహిష్కరించారని చెబుతూ తొలినుండి కేసీఆర్ తన పట్ల కుట్ర పూరితంగా వ్యవహరించారని ఆమె మండిపడ్డారు.
‘‘ తెలంగాణ బిల్లు పాస్ అయినప్పుడు కేసీఆర్ పార్లమెంట్‌లో లేరు. ఆయన సోనియా గాంధీ కాళ్ళ మీద పడ్డారు. ఆ తర్వాత యూటర్న్ తీసుకున్నారు. తెలంగాణలో తన కుటుంబం మాత్రమే ఎదగాలనే స్వార్థం కేసీఆర్‌ది” అంటూ విజయశాంతి దుయ్యబట్టారు.
కాంగ్రెస్ పార్టీ అసలు సమస్యలపై పోరాటం చేయడం లేదని అంటూ కాంగ్రెస్‌కు ఆయన స్లో పాయిజన్ ఎక్కించారని, కాంగ్రెస్ పోరాడలేని స్థితికి చేరుకుందని ఆమె విమర్శించారు. తెలంగాణలో కొట్లాడే నేతలు ఉండకూడదన్న యోచనలో కేసీఆర్ అందర్నీ ఆ పార్టీలో చేర్చుకున్నారని ధ్వజమెత్తారు.
కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి , తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, కె.లక్ష్మణ్, వివేక్ వెంకటస్వామి, మాజీ రాష్ష్ట్ర అధ్యక్షుడు ఎన్ ఇంద్రసేనారెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
More Stories
గణేష్ పూజను కూడా ఓర్వలేకపోతున్న కాంగ్రెస్
త్వరలో జనగణన… ఆ తర్వాతే కులగణనపై నిర్ణయం!
ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనం పూర్తి