ఏపీలో పంచాయతీ ఎన్నికలపై  స్టేకు హైకోర్టు నో

ఆంధ్ర్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టులో మరోసారి చుక్కెదురైంది. ఎన్నికల కమిషన్ ఫిబ్రవరిలో తలపెట్టిన పంచాయతీ ఎన్నికల ప్రక్రియను నిలుపుదల చేయాలని కోరుతూ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు తోసిపుచ్చింది. 
 
ఎన్నికల కమిషన్ ప్రక్రియలో జోక్యం చేసుకోబోమని, ప్రస్తుత పరిస్థితుల్లో నిలుపుదల చేయలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. ఏపీ ప్రభుత్వం వేసిన పిటిషన్ కు కౌంటర్ దాఖలు చేయాలని, కేసు తదుపరి విచారణను  హైకోర్టు ఈనెల 14కు వాయిదా వేసింది. 
 
ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లేందుకు ఏపీ ప్రభుత్వం సుముఖంగా లేని విషయం తెలిసిందే. అందుకే ఎన్నికలను నిలుపుదల చేయడానికి ప్రయత్నిస్తోంది.  
 
ఎన్నికల కమిషన్ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని,  రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండా నిర్ణయం తీసుకున్నారని రాష్ట్ర ప్రభుత్వం కోర్టులో పిటిషన్లు దాఖలు చేసింది. ఈనెల 14న తదుపరి విచారణ అనంతరం కోర్టు తుదితీర్పు వెలువరించే అవకాశం ఉంది.