35 ఏళ్లు నిండిన వలంటీర్లు ఇంటికే

35 ఏళ్లు నిండిన వలంటీర్లు ఇంటికే

ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం ప్రవేశపెట్టిన నవరత్నాల అమలులో భాగంగా నియమించిన వలంటీర్లకు 35 ఏళ్ల వయసు నిండితే ఉద్యోగం నుంచి తొలగించాల్సిందిగా ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 

18 సంవత్సరాలలోపు వయసు కలిగిన వారితోపాటు 35 సంవత్సరాల వయసు నిండిన వారిని తక్షణమే విధుల నుంచి తొలగించాల్సిందిగా గ్రామ వలంటీరు సచివాలయం, వార్డు వలంటీరు సచివాలయం శాఖ డైరెక్టర్‌, కమిషనర్‌ జీఎస్‌.నవీన్‌కుమార్‌ సోమవారం ఉత్తర్వులు జారీ చేయడంతో వలంటీర్లు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. 

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నవరత్నాల పథకాల అమలులో భాగంగా సంక్షేమ లబ్ధిని ఇంటింటికీ అందించే లక్ష్యంతో హడావుడిగా వలంటీర్ల పోస్టులను భర్తీ చేశారు. 50 ఇళ్లకు ఒక వలంటీరును నియమిస్తూ రాష్ట్రంలో 2.60 లక్షల మందిని గ్రామ, వార్డు వలంటీర్లను నియమించారు.

రాజకీయ ఒత్తిళ్లతో నిబంధనలు ఉల్లంఘించి వలంటీర్ల నియామకాలు జోరుగా సాగాయి. వీరంతా అధికార పార్టీ ప్రాధాన్యతలకు  అనుగుణంగా,గ్రామాలలో ఆ పార్టీకి రాజకీయ కార్యకర్తలుగా ఉపయోగించుకొనేందుకే నియమించినట్లు విమర్శలు చెలరేగాయి. 

35 ఏళ్లు నిండిన వారెవరైనా ఉంటే వారిని ఆ విధుల నుంచి తొలగించాల్సిందిగా కమిషనర్‌ ఉత్తర్వులు ఇచ్చారు. ఇప్పటికే 35 ఏళ్లు నిండి వలంటీరుగా పనిచేస్తున్న వ్యక్తులకు సీఎఫ్‌ఎంఎస్‌ సిస్టమ్‌ ద్వారా అందించే జీతాలు రావడంలేదు. ఈ అంశం కొంతకాలం నుంచి చర్చనీయాంశమైంది. 

ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా 35 ఏళ్లు నిండిన వలంటీర్ల నియామకం జరిగిన దృష్ట్యా వారిని విధుల నుంచి తొలగించాలని, ఆ ఖాళీల భర్తీకి తదుపరి చర్యలు చేపట్టాలని ఆదేశాలు అందాయి. ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులతో ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న వలంటీర్లలో ఆందోళన నెలకొంది.