నాడీ వ్యవస్థపై విషపదార్థాల ప్రభావం తీవ్రంగా పడటం వల్లనే ఏలూరులో కుప్పలు తెప్పలుగా మూర్ఛ కేసులు నమోదు అవుతున్నట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ ప్రాథమిక అంచనాకు వచ్చింది. ఒకే ప్రాంతం నుంచి ఎక్కువమంది ఈ సమస్యతో ఆస్పత్రి పాలవుతున్నారు. కాబట్టి వారు తినే ఆహారంలో ఆర్గానో పాస్ఫేట్, లేక ఫైలేత్రిం విష పదార్థం కలిసి ఉంటుందని వైద్యులు అంచనాకు వచ్చారు.
ఈ విష పదార్థం శరీరంలోకి వెళ్లడం వల్ల నాడీ వ్యవస్థ దెబ్బతింటుంది. తొలుత మెదడు, వెన్నెముకతో పాటు శరీరంలోని నరాలపై తీవ్ర ప్రభావం పడుతుంది.ఈ సమయంలో నెమ్మదిగా ఒళ్లు నొప్పులు ప్రారంభమై, అకస్మాత్తుగా మూర్ఛ వస్తుంది. ప్రస్తుతం ఏలూరులో నమోదవుతున్న కేసుల్లో 80 శాతం మందిలో ఇవే లక్షణాలు కనిపిస్తున్నాయి.
కాగా, బాధితుల శరీరంలో లెడ్ హెవీ మెటల్, నికెల్ పదార్ధాలు ఉన్నట్లు ఎయిమ్స్ నిపుణుల బృందం గుర్తించింది. తాగునీరు లేదా పాల ద్వారా శరీరంలో చేరి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాగా వీరి నివేదిక అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది.
మరోవైపు ఆస్పత్రుల్లో చేరుతున్న రోగుల్లో మరొక లక్షణాన్ని సోమవారం వైద్యులు గుర్తించారు. బాధితుల కళ్లను పరిశీలించగా, ‘ప్యూపిల్ డైలటేషన్’ అనే సమస్య బయటపడింది. విషపదార్థాల ప్రభావం నాడీవ్యవస్థపై పనిచేసి.. కంటిలోని నల్లగుడ్డు స్పందన తగ్గుతుందని, కళ్లు బైర్లు కమ్మడం వంటి సమస్యలు దీనివల్ల తలెత్తుతాయని ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు.
ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో సోమవారం పరిశీలించిన రోగుల్లో 70 నుంచి 80 శాతం మందికి ఈ సమస్య ఉందని గుర్తించారు. అయితే ఆరోగ్యశాఖ ఇప్పటివరకూ చేసిన పరీక్షల వల్ల ఎలాంటి సమస్య బయటపడలేదు. అందరి రిపోర్టులు నార్మల్‌గానే ఉన్నాయి. 45 మందికి బ్రెయిన్ సీటీ స్కాన్ చేశారు. ఇందులోనూ ఏమీ తేలలేదు.
తొమ్మిది డెయిరీల నుంచి పాల నమూనాలు తీసుకున్నారు. ఈ రిపోర్టులు రావాల్సి ఉంది. కల్చర్ రిపోర్టు, ఈ-కోలీ పరీక్ష ఫలితాల కోసం అధికారులు ఎదురుచూస్తున్నారు. సెల్యులర్ అండ్ మాలిక్యులర్ అనాలసిస్ కోసం 10 మంది దగ్గర నుంచి శాంపిల్స్ తీసుకుని హైదరాబాద్ సీసీఎంబీకి పంపించారు.
రిపోర్టు 36 గంటల తర్వాత రావచ్చు. ఒకవేళ వైరల్ లేదా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఈ వ్యాధికి కారణమయితే ఈ పరీక్షల్లో తెలిసిపోతుంది.
‘‘సమస్య ఏమిటన్నది ఇప్పటి వరకూ నిర్ధారణ కాలేదు. బాధితుల దగ్గర నుంచి రక్త, మూత్ర నమూనాలు తీసుకుని పరీక్షించాం. ఆయా ప్రాంతాల్లో వాటర్ సేకరించి పరీక్షించాం. మంగళగిరి, ఢిల్లీ ఎయిమ్స్ ప్రతినిధులు కూడా ఏలూరు వచ్చారు” అని ఆరోగ్యశాఖ కమీషనర్ కాటంనేని భాస్కర్ తెలిపారు.
వైరస్, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ అయితే మాత్రం ‘సీసీఎంబీ’లో తెలుస్తుందని చెప్పారు. డిశ్చార్జి చేసిన తర్వాత కూడా బాధితుల ఆరోగ్యపరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. క్షేత్రస్థాయిలో ఆరోగ్య సిబ్బంది వాళ్ల ఇళ్లకు వెళ్లి ఎప్పటికప్పుడు వారి పరిస్థితిని ఆరా తీసుకున్నారని పేర్కొన్నారు.
More Stories
అమరావతి పాత టెండర్లు రద్దు
సీఎం హామీలకు విలువ లేకుండా పోయింది
కాంగ్రెస్, ఆర్జేడీలు గిరిజన వ్యతిరేకులు