దశాబ్దాల శత్రుత్వానికి, ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలకు తెరదించుతూ అమెరికా-ఇరాన్ మధ్య చారిత్రాత్మక శాంతి ఒప్పందం కుదిరింది. ఈ చారిత్రాత్మక పరిణామాన్ని పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ ప్రకటించిన కొద్దిసేపటికే, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ‘ట్రూత్ సోషల్’ ఖాతా ద్వారా అధికారికంగా ధృవీకరించారు.
అన్ని రకాల సైనిక చర్యలను శాశ్వతంగా నిలిపివేయడానికి ఇరు దేశాలు అంగీకరించిన నేపథ్యంలో, ఈ నెల 19న (శుక్రవారం) స్విట్జర్లాండ్‌లో జి7 సదస్సు పూర్తికాగానే ఈ ఒప్పందంపై ఇరు దేశాలు అధికారికంగా సంతకాలు చేయనున్నాయి. అమెరికా, ఇరాన్‌లు ఒక ఒప్పందానికి వచ్చాయని, ఆ దేశంపై వాషింగ్టన్ విధించిన నావికా దిగ్బంధనాన్ని ముగిస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. నెలల తరబడి సాగుతున్న చర్చలలో ఇది అతిపెద్ద పురోగతి అని ఆయన తెలిపారు.
“ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్‌తో ఒప్పందం ఇప్పుడు పూర్తయింది. అందరికీ అభినందనలు!” అని ట్రంప్ ‘ట్రూత్ సోషల్’లో ఒక పోస్ట్‌లో పేర్కొన్నారు. శాంతి ఒప్పందాన్ని అంగీకరించేలా అమెరికాపై టెహ్రాన్ ఒత్తిడి తెచ్చిందని ఇరాన్ ప్రభుత్వ టీవీ చెబుతున్నట్లు రాయిటర్స్ నివేదించింది. వైట్ హౌస్ ఈ ఒప్పంద వివరాలను వెంటనే విడుదల చేయలేదు. శుక్రవారం స్విట్జర్లాండ్‌లో సంతకాల కార్యక్రమం జరగనుంది. తాను అక్కడ ఉంటానని, ట్రంప్ కూడా హాజరయ్యే అవకాశం ఉందని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తెలిపారు.
కొత్తగా ప్రకటించిన కాల్పుల విరమణ ఒప్పందం మధ్యప్రాచ్యంలో ఒక “కొత్త శకానికి” నాంది పలకగలదని ఆయన పేర్కొన్నారు. గల్ఫ్ దేశాలు, ఇతర ప్రాంతీయ భాగస్వాములతో ట్రంప్ జరిపిన దౌత్యపరమైన ప్రయత్నాల వల్లే ఈ ఒప్పందం సాధ్యమైందని ఆయన పేర్కొన్నారు. “ఆ ప్రాంతాన్ని సమూలంగా మార్చేందుకు అవసరమైన నిజమైన అవకాశాన్ని అధ్యక్షుడు కల్పించారు. ఇక ఇప్పుడు, ఇరానియన్లతో కూడా ఒక కొత్త శకం మొదలవుతుందని ఆశిద్దాం” అని తెలిపారు.
వాషింగ్టన్, టెహ్రాన్‌ల మధ్య కుదిరిన ఈ అవగాహన ఒప్పందం, యుద్ధాన్ని ముగించేందుకు మరో 60 రోజుల చర్చలకు నాంది పలుకుతుందని భావిస్తున్నారు. ఈ ఒప్పందంపై అధ్యక్షుడు ట్రంప్ స్పందిస్తూ, “ఈ గొప్ప ఒప్పందం మొత్తం ప్రాంతంలో శాంతి, భద్రతలను తీసుకువస్తుంది. నాకంటే ముందు చాలా మంది అధ్యక్షులు ఇరాన్‌తో శాంతిని నెలకొల్పడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. కానీ ఈ ప్రాంతంలోని నాయకులకు, చరిత్రలోనే మొదటిసారిగా నిజమైన శాంతిని సాధించడంలో సహాయపడే ఒక సమర్థుడైన అధ్యక్షుడు దొరికారు” అని పేర్కొన్నారు.
దశాబ్దాలుగా నెలకొన్న ఈ వివాదానికి ముగింపు పలికేలా కుదిరిన శాంతి ఒప్పందానికి అహర్నిశలూ సహకరించిన, మధ్యవర్తిత్వం వహించిన ప్రతి ఒక్కరికీ ఆయన ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేశారు. ఈ ఒప్పందంలో భాగంగా అంతర్జాతీయ వాణిజ్యానికి, ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన నిర్ణయాలను ట్రంప్ వెల్లడించారు. వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైన ‘హర్మూజ్ జలసంధి’ ఇకపై ఎలాంటి అదనపు సుంకాలు లేకుండా పూర్తిగా తెరుచుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. అలాగే ఇరాన్ ఓడరేవులపై విధించిన దిగ్బంధాన్ని తక్షణమే ఎత్తివేయాలని అమెరికా రక్షణ రంగాన్ని ఆదేశించినట్లు పేర్కొన్నారు.
శుక్రవారం ఒప్పందంపై సంతకాలు జరిగిన వెంటనే, జలసంధిలో అమర్చిన మైన్లను (సముద్రపు ల్యాండ్‌మైన్లు) తొలగించే ప్రక్రియ ప్రారంభమవుతుందని, హర్మూజ్ జలసంధి ద్వారా చమురు రవాణాను యథావిధిగా పునఃప్రారంభించాలని ఆయన పిలుపునిచ్చారు. దీనివల్ల ఇరువైపుల నుండి చమురు సరఫరా మళ్లీ ప్రారంభమై, ప్రపంచ ఇంధన మార్కెట్‌కు ఎంతో మేలు జరుగుతుందని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇరాన్ విదేశాంగ శాఖ న్యాయ, అంతర్జాతీయ వ్యవహారాల ఉప మంత్రి కాజెమ్ ఘరీబాబాది, సైనిక చర్యలకు “త్వరలోనే” ముగింపు పలకనున్నట్లు ధృవీకరించారు. ఇరాన్‌కు చెందిన తస్నిమ్ వార్తా సంస్థ ప్రచురించిన వ్యాఖ్యల ప్రకారం, “లెబనాన్‌తో సహా వివిధ రంగాలలో యుద్ధానికి, సైనిక చర్యలకు తక్షణ, శాశ్వత ముగింపు”ను సోమవారం నుంచి ప్రకటిస్తామని ఘరీబాబాది తెలిపారు.

More Stories
రెబల్ టీఎంసీ ఎంపీలు 20 మంది ఎన్సీపీఐలో విలీనం..స్పీకర్ కు లేఖ
భావోద్వేగంతో 36 ఏళ్ళ తర్వాత విదేశాల్లోని కాశ్మీరీ పండిట్ల పర్యటన
మహిళల టీ20 ప్రపంచకప్‌లో పాక్ పై ఘన విజయం