పీఓకే నిరసనకారులపై ప్రాణాంతక బలప్రయోగం.. ఆమ్నెస్టీ ఆందోళన

పీఓకే నిరసనకారులపై ప్రాణాంతక బలప్రయోగం.. ఆమ్నెస్టీ ఆందోళన
 పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ఎన్నికల సమయంలో నిరసనకారులపై ప్రాణాంతక బలప్రయోగం జరిగినట్లు వచ్చిన నివేదికల నేపథ్యంలో అధికారులు కమ్యూనికేషన్ల నిలిపివేతను ఎత్తివేయాలని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ డిమాండ్ చేసింది.  ప్రాంతీయ ఎన్నికల మొదటి రోజున, పాకిస్తాన్ పరిపాలనలోని జమ్మూ కాశ్మీర్‌లోని రావల్కోట్‌లో నిరసనకారులపై భద్రతా దళాలు ప్రాణాంతక బలప్రయోగం చేశాయన్న నివేదికలపై  దక్షిణాసియా తాత్కాలిక ప్రాంతీయ డైరెక్టర్ ఇసాబెల్ లస్సీ ఆందోళన వ్యక్తం చేశారు. 
 
“రావల్కోట్ నుండి వెలువడుతున్న ఆందోళనకరమైన నివేదికలు, జమ్మూ కాశ్మీర్‌లో నిరసనకారులపై పాకిస్తాన్ అధికారుల సుదీర్ఘకాలంగా ఉన్న చట్టవిరుద్ధ హింసా చరిత్రకు అనుగుణంగా ఉన్నాయి. నిరసనకారులపై భద్రతా దళాలు బలప్రయోగం చేయడంపై తక్షణ, స్వతంత్ర, పారదర్శక విచారణకు ఆదేశించాలి” అని ఆమె కోరారు. 
ఇంటర్నెట్, మొబైల్ సేవల నిలిపివేత కొనసాగుతున్నంత కాలం, క్షేత్రస్థాయిలో పరిస్థితి యొక్క పూర్తి స్థాయిని స్వతంత్రంగా ధృవీకరించడానికి ఇది తీవ్రంగా ఆటంకం కలిగిస్తుందని ఆమె స్పష్టం చేశారు.  అన్ని కమ్యూనికేషన్ల సదుపాయాన్ని పునరుద్ధరించాలని, మీడియా, స్వతంత్ర పరిశీలకులను ఆ ప్రాంతంలోకి అనుమతించాలని  పాకిస్తాన్ అధికారులను ఆమె కోరారు.
 
జమ్మూ కాశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (జాక్)పై విధించిన చట్టవిరుద్ధ నిషేధం వల్ల ఈ ఎన్నికల చుట్టూ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయని పేర్కొంటూ ఈ నిరసన ఉద్యమంపై నిషేధాన్ని ఎత్తివేయాలని, జేఏఏసీ సభ్యులను, మద్దతుదారులను అణచివేయడానికి, ఏకపక్షంగా నిర్బంధించడానికి ఉగ్రవాద వ్యతిరేక చట్టాలను ఆయుధంగా వాడుకోవడాన్ని ఆపాలని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ పాకిస్థాన్ అధికారులకు పదేపదే పిలుపునిచ్చింది. 
 
నిరసనకారులపై ప్రాణాంతక హింసను ప్రయోగించడానికి ఈ నిషేధాన్ని సాకుగా ఉపయోగించరాదని ఆమె స్పష్టం చేసింది. జూలై 27న రావాలాకోట్‌లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. అలాగే కోట్లీలో ప్రత్యర్థి పార్టీల మద్దతుదారుల మధ్య జరిగిన ఘర్షణలో ఒక రాజకీయ కార్యకర్త మరణించారు. నిరసనకారులపై భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో 19 మంది మరణించారని, డజన్ల కొద్దీ ప్రజలు గాయపడ్డారని జాక్ పేర్కొంది. 
 
ప్రాణనష్టం జరిగిందని మీడియా సంస్థలు నివేదించినప్పటికీ నిర్దిష్ట సంఖ్యను వెల్లడించలేదు. మరోవైపు, తమ సిబ్బందిలో ఇద్దరు గాయపడ్డారని పోలీసులు తెలిపారు. జమ్మూ & కాశ్మీర్‌లో జూన్ 5 నుండి మొబైల్ ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు.  జూన్ 5, 2026న ‘ఆజాద్ జమ్మూ అండ్ కాశ్మీర్ యాంటీ-టెర్రరిజం యాక్ట్, 2014’లోని మొదటి షెడ్యూల్ కింద జాక్ ని “నిషేధిత సంస్థ”గా ప్రకటించారు.
ఎన్నికలకు ముందు జరిగిన పరిణామాల్లో కనీసం 40 మంది మరణించారని మీడియా నివేదించింది. వీరిలో 34 మంది నిరసనకారులు కాగా, ఆరుగురు పోలీసులు మరియు పారామిలిటరీ సిబ్బంది ఉన్నారు.