అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తోన్న కఠిన వలస వ్యతిరేక విధానాల నడుమ డెమొక్రాటిక్ సెనేటర్ ఒకరు కీలక ముసాయిదా బిల్లును ప్రవేశపెట్టారు. దీంతో అమెరికాలో సుదీర్ఘ కాలంగా నివసిస్తున్న భారతీయ హెచ్-1బీ వీసాదారులు సహా లక్షలాది మంది విదేశీయులకు శాశ్వత నివాసం హోదా కల్పించి, గ్రీన్ కార్డు పొండదానికి మార్గాన్ని సుగమం చేసేందుకు ఈ సరికొత్త ప్రయత్నం ప్రారంభించారు.
ఈ బిల్లు ఆమోదం పొంది చట్టంగా మారితే, అమెరికాలో కనీసం ఏడు సంవత్సరాలు నిరంతరాయంగా నివాసం ఉండే వలసదారులు గ్రీన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం లభిస్తుంది. కాలిఫోర్నియా సెనేటర్ అలెక్స్ పడిల్లా మాట్లాడుతూ తన ప్రతిపాదన 1986 నుంచి నవీకరించని వలస నిబంధనను ఆధునీకరిస్తుందని, దీనివల్ల ఎనిమిది మిలియన్ల కంటే ఎక్కువ మంది విదేశీయులు ప్రయోజనం పొందుతారని తెలిపారు.
‘‘కష్టపడి పనిచేసే వలసదారులపై ట్రంప్ ప్రభుత్వం అవలంభిస్తున్న కఠిన వైఖరికి వ్యతిరేకంగా ఏడాది కిందటే నేను ఈ బిల్లును ప్రవేశపెట్టాను. అప్పటి నుంచి ట్రంప్ యంత్రాంగం సృష్టిస్తోన్న భయానక వాతావరణం మరింత పెరిగింది. ఈ దేశంలోనే తమ జీవితాలను నిర్మించుకున్నప్పటికీ, ఎన్నో కుటుంబాలు భయం భయంగానే బతుకుతున్నాయి” అని చెప్పారు.
“మన ఆర్థిక వ్యవస్థకు, సమాజానికి నిరంతరం తోడ్పడుతున్న మిలియన్ల మంది సుదీర్ఘకాల నివాసితులను కాంగ్రెస్ ఇకపై విస్మరించలేదు. మన వలస చట్టాలను ఆధునీకరించి, న్యాయబద్ధమైన శాశ్వత నివాస హోదాను పొందే మార్గాన్ని కల్పించాల్సిన సమయం ఆసన్నమైంది’’ అని పేర్కొన్నారు. 1929 నాటి ఇమ్మిగ్రేషన్ చట్టంలోని ‘పునరుద్దరణ నిబంధనలు’ కనీసం ఏడేళ్లు అమెరికాలో నివసిస్తున్న వలసదారులు చట్టబద్ధమైన శాశ్వత నివాస హోదా కోసం దరఖాస్తు చేసుకోవడానికి అనుమతిస్తాయి.
దరఖాస్తుదారులకు ఎలాంటి నేర చరిత్ర ఉండకూడదు. గ్రీన్ కార్డ్ కోసం ప్రస్తుతం ఉన్న అన్ని ఇతర అర్హతా ప్రమాణాలను కూడా వారు అందుకోవాల్సి ఉంటుంది. ఇది డ్రీమర్లు, టెంపరరీ ప్రొటెక్టెడ్ స్టేటస్ కలిగినవారు, అత్యవసర కార్మికులు, దీర్ఘకాలిక వీసాదారుల పిల్లలకు వర్తిస్తుంది. ఉపాధి ఆధారిత గ్రీన్ కార్డ్‌ల కోసం ఏళ్లకు ఏళ్లుగా ఎదురుచూస్తున్న హెచ్-1బి వీసాదారులతో సహా అత్యంత నైపుణ్యం కలిగిన కార్మికులకు కూడా సహాయపడుతుంది.
అమెరికాలోని నివాసం ఉండే హెచ్-1బి వీసాదారులలో అత్యధికంగా ఉండే భారతీయ నిపుణులకు ఈ ప్రతిపాదన వల్ల లబ్ది చేకూరుతుంది. ఉపాధి ఆధారిత గ్రీన్ కార్డ్ పరిమితుల కారణంగా వీరు శాశ్వత నివాసం కోసం సుదీర్ఘంగా నిరీక్షించాల్సి వస్తుంది. ఈ బిల్లు ద్వారా ‘ఇమ్మిగ్రేషన్ అండ్ నేషనాలిటీ చట్టంలోని సెక్షన్ 249ను సవరిస్తారు.
ఈ బిల్లుకు సెనేట్ డెమొక్రటిక్ విప్ డిక్ డర్బిన్ సహ-నాయకత్వం వహిస్తుండగా, మరో 14 మంది సెనేటర్లు కో-స్పాన్సర్లుగా సంతకాలు చేశారు.

More Stories
అరెస్ట్, మరణం, జైలు ప్రమాదాలున్నా స్వదేశం వెడతా!
రష్యా `ఉగ్రవాదుల’ జాబితాలో టెలిగ్రామ్ ఫౌండర్ పావెల్ దురోవ్
పీఓకే నిరసనకారులపై ప్రాణాంతక బలప్రయోగం.. ఆమ్నెస్టీ ఆందోళన