తిరువనంతపురం కార్పొరేషన్ పై బిజెపి కన్ను 

ప్రస్తుతం కేరళలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికలలో తిరువనంతపురం మునిసిపల్ కార్పొరేషన్ లో పాగా వేయడంకోసం బీజేపీకి ప్రతిష్టాకరంగా ప్రచారం చేపట్టింది. 100 వార్డ్ లతో రాష్ట్రంలోనే పెద్ద పురపాలక సంఘమైన ఇది గత 15 ఏళ్లుగా సిపిఎం పాలనలో ఉంది. 
 
నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలలో విస్తరించి ఉన్న ఈ నగరంను హస్తగతం చేసుకోవడానికి రాష్ట్రంలో ప్రధాన రాజకీయ కూటమిలైన ఎల్ డి ఎఫ్, యు డి ఎఫ్, ఎన్ డి ఎ తీవ్రంగా కృషి చేస్తున్నాయి. బుధవారం ఇక్కడ ఏంన్నికలు జరుగనున్నాయి. 
 
2010 ఎన్నికలలో 4 వార్డ్ లలో మాత్రమే గెలుపొందిన బిజెపి 2015 ఎన్నికలలో 34వార్డ్ లలో గెలుపొంది అందరిని ఆసచర్యనికి గురిచేసింది. ఆ విధంగా చేయడం ద్వారా యూడీఎఫ్ ను మూడో స్థానానికి త్రోసివేసి, 42 వార్డ్ లతో అధికారమలోకి వచ్చిన సిపిఎం నేతృత్వ కూటమికి సమీపంలోకి చేరుకొంది. 
 
రెండు కూటముల సాంప్రదాయ వోట్ బ్యాంకు లలో చీలిక తీసుకొచ్చి బిజెపి గణనీయంగా తన బలాన్ని పెంపొందింప చేసుకొంది. ఈ సారి సొంతంగా ఆధిక్యత పొంది, మేయర్ పదవిని కైవసం చేసుకోవడం కోసం బిజెపి పట్టుదలగా ఉంది. ఎల్ డి ఎఫ్ ప్రభుత్వం కొనసాగుతున్న సమయంలో రాష్ట్ర రాజధాని నగరంలో పాగా వేయడం ద్వారా వచ్చే ఏడాది మొదట్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలపై చెప్పుకోదగిన ప్రభావం చూపవచ్చని బిజెపి ఆశిస్తున్నది. 
 
గత వారమే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలలో 4 సీట్ల నుండి 48 సీట్లకు బీజేపీ బలం పెంచుకోవడం తిరువనంతపురంలోని పార్టీ నేతలకు ఉత్సాహం కలిగిస్తున్నది. గత అసెంబ్లీ ఎన్నికలలో నిలబెట్టిన పార్టీ సీనియర్ నేతను వివి రాజేష్ ను కార్పొరేషన్ ఎన్నికలలో పోటీ చేయించడం పట్ల పలువురు విస్మయం వ్యక్తం చేసారు. 
 
అయితే రాష్ట్ర అధ్యక్షుడు కె సురేంద్రన్ ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ ఇక్కడ అధికారం కైవసం చేసుకోవడం కోసమే పోటీ చేస్తున్నట్లు తమ అభ్యర్థుల ఎంపిక స్పష్టం చేస్తున్నదని భరోసా వ్యక్తం చేశారు. తిరువనంతపురం నగరంలో బిజెపి, ఆర్ ఎస్ ఎస్ లకు చెప్పుకోదగిన బలం ఉంది. 2014 లోక్ సభ ఎన్నికలలో బిజెపి అభ్యర్థి ఓ రాజగోపాలన్ కు నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలలో కూడా అప్పటి కేంద్ర మంత్రి శశి థరూర్ పై ఆధిక్యత లభించడం గమనార్హం. 
 
అయితే వివిధ కారణాల చేత 2016 అసెంబ్లీ ఎన్నికలలో, 2019 లోక్ సభ ఎన్నికలలో నగరంలో అటువంటి ఆధిక్యతను బీజేపీ అభ్యర్థులు పొందలేక పోయారు. తర్వాత తిరువనంతపురం నగరంలోని వత్తియూరుకావు అసెంబ్లీకి జరిగిన ఉపఎన్నికను బిజెపి ప్రతిష్టాకరంగా తీసుకొని కుమ్మణం రాజశేఖరన్ ను మిజోరాం గవర్నర్ పదవికి రాజీనామా చేయించి మరీ పోటీచేయించారు. అయితే ఆ ఉపఎన్నికలో బిజెపి అభ్యర్హ్ది ఘోర పరాజయానికి గురయ్యారు. 
 
ఈ అనుభవాలను దృష్టిలో ఉంచుకొని, వచ్చే ఏడాది మొదట్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ కార్యకర్తలలో నూతన ఉత్సాహం నింపడం కోసం బిజెపి తిరువనంతపురం కార్పొరేషన్ ఎన్నికలను ప్రతిష్టాకరంగా తీసుకొని ఆధిక్యతకోసం కృషి చేస్తున్నది.