పాత చట్టాలతో కొత్త శతాబ్దాన్ని నిర్మించలేం

పాత చట్టాలతో కొత్త శతాబ్దాన్ని నిర్మించలేం

పాత చట్టాలతో కొత్త శతాబ్దాన్ని నిర్మించలేమని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. అభివృద్ధి జరగాలంటే సంస్కరణలు ఎంతో అవసరమని చెబుతూ  శతాబ్దాల కింద చేసిన చట్టాలు ప్రస్తుతం భారంగా మారాయని పేర్కొన్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ ‘ఆగ్రా మెట్రో రాయ్ ప్రాజెక్ట్’ ను వర్చువల్ గా ప్రారంభిస్తూ చేసిన ఈ వాఖ్యలు కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు ఆందోళన చేస్తుండటం, 8న భారత్ బంద్ నేపథ్యంలో ప్రాధాన్యత సంతరింప చేసుకున్నాయి. 

‘‘అభివృద్ధి కావాలంటే సంస్కరణలు అత్యావశ్యకం. నూతన సౌకర్యాలు కల్పించాలన్నా, నూతన నిర్ణయాలు తీసుకోవాలన్నా… సంస్కరణలు కచ్చితం. గత శతాబ్దపు చట్టాలతో నూతన శతాబ్దాన్ని నిర్మించలేం.’’ అని మోదీ తేల్చి చెప్పారు. 

సంస్కరణలనేవి నిరంతరాయంగా జరిగే ప్రక్రియ అని, గత శతాబ్దంలో కొన్ని చట్టాలు ఉపయోగంలో ఉండేవని, కానీ ఈ శతాబ్దానికి అవి భారంగా మారాయని పేర్కొన్నారు. గత ప్రభుత్వాల హయాంలో సంస్కరణలు కొన్ని రంగాలకు, శాఖలకు మాత్రమే పరిమితమయ్యేవని, కానీ తమ ప్రభుత్వంలో మాత్రం అన్ని రంగాలకూ సంస్కరణలను విస్తరించామని ప్రధాని మోదీ తెలిపారు.