ఒక వంక గోదావరిలో మిగులు జలాలన్నీ తమవే అని వాదిస్తూ, మరోవంక గోదావరిలో అసలు మిగులు జలాలే లేవని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేస్తున్నది. గోదావరి మిగులు జలాలు చూపుతూ ఆ నదిపై తెలంగాణ ప్రభుత్వం చేబడుతున్న సాగునీటి ప్రాజెక్ట్ లన్ని అక్రమమైనవే అని పేర్కొంటూ, దిగువ రాష్ట్రంగా గోదావరి మిగులు జలాల్లో తమకు మాత్రమే హక్కు ఉందని స్పష్టం చేసింది.
మరోసారి నేషనల్ వాటర్ డెవలప్ మెంట్ ఏజెన్సీ (ఎన్‌డబ్ల్యూడీఏ) సమావేశంలో తమ వాదనలను పునరుద్ధరిస్తూ గోదావరిలో మిగులు జలాలే లేనప్పుడు కావేరి లింక్ ప్రాజెక్టును ఎలా చేపడుతారని ప్రశ్నించింది. గోదావరిలో 75 శాతం డిపెండబులిటీని లెక్కలోకి తీసుకుంటే అసలు మిగులు జలాలే లేవని ఏపీ ఇంజనీర్లు వాదించారు.
ఒకవేళ కొద్దిపాటి నీటి లభ్యత ఉన్నా అవి దిగువ రాష్ట్రంగా తమకు మాత్రమే చెందుతాయని తెలిపారు. తెలంగాణ సైతం గోదావరిలో మిగులు జలాలు లేవని, తమ రాష్ట్రం అసవరాలు తీరిన తర్వాతే లింక్ ప్రాజెక్టును చేపట్టాలని పేర్కొనడం గమనార్హం.
గోదావరి, – కృష్ణా, – పెన్నా, – కావేరి నదుల అనుసంధానంపై సోమవారం ఎన్‌డబ్ల్యూడీఏ డీజీ భూపాల్‌సింగ్ అధ్యక్షతన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన సమావేశంలో తెలంగాణ, ఏపీతో పాటు చత్తీస్‌గఢ్, ఒడిశా, మహారాష్ట్ర, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల ఇంజనీర్లు పాల్గొన్నారు.
మూడు ప్రతిపాదనలపై ఈ సమావేశంలో చర్చించారు. తెలంగాణ, ఏపీ ప్రతినిధులు గోదావరిలో మిగులు జలాలే లేవంటూ వాదించగా అదే విషయాన్ని రాతపూర్వకంగా చెప్పాలని ఎన్‌డబ్ల్యూడీఏ డీజీ సూచించారు. తమ రాష్ట్రంలోని ఉత్తరాంధ్రతో పాటు రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో తీవ్ర నీటి ఎద్దడి నెలకొందని, ముందు తమ రాష్ట్ర అవసరాలు తీర్చాల్సి ఉందని ఏపీ ఇంజినీర్లు స్పష్టం చేశారు.
ఒకవేళ కేంద్రం గోదావరి –- కావేరి అనుసంధానం చేపట్టాలని అనుకుంటే పోలవరం నుంచి ప్రకాశం బ్యారేజీ మీదుగా బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ ద్వారా కావేరికి తరలించే అలైన్‌మెంట్‌ను పరిగణలోకి తీసుకోవాలని సూచించారు.
కాగా, మహానది నుంచి మొదట గోదావరి లింక్ ప్రాజెక్టు చేపట్టి అలా మళ్లించే నీటిని కావేరికి తరలిస్తే తమకు అభ్యంతరం లేదని తెలంగాణ ఇంజనీర్లు తెలిపారు. గోదావరిలో మిగులు జలాలు లేనందున కావేరి లింక్ ప్రాజెక్టుకు ఇంతకు మించిన ప్రత్యామ్నాయం ఇంకోటి లేదని పేర్కొన్నారు. NDఅయితే. మహానది నుంచి నీటిని తరలించాలన్న తెలంగాణ ప్రతిపాదనను చత్తీస్‌గఢ్ ఇంజనీర్లు వ్యతిరేకించారు.
More Stories
విశాఖ ఉక్కు కాపాడుకుందాం
22న కృష్ణాతీరంలో 5వేల డ్రోన్ల ప్రదర్శన
రేణిగుంట విమానాశ్రయానికి బాంబు బెదిరింపు