‘సిమి’ సభ్యుడు అబ్దుల్లా డానిష్ అరెస్ట్

శ ద్రోహం కేసులో నిందితుడు, స్టూడెంట్ ఇస్లామిక్ మువ్‌మెంట్ ఆఫ్ ఇండియా (సిమి) సభ్యుడు అబ్దుల్లా డానిష్ (58)ని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. నిషిద్ధ సిమి గ్రూప్ సభ్యుడైన డానిష్ ఉత్తర ప్రదేశ్‌లోని అలీగఢ్ సమీపంలోని దూద్‌పూర్‌లో నివసిస్తున్నట్లు గుర్తించారు. 

దేశద్రోహం, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు కేసు నమోదైంది. ఢిల్లీ పోలీసులు  తెలిపిన వివరాల ప్రకారం అబ్దుల్లా డానిష్‌ను ఈ నెల 5న అరెస్టు చేశారు. దేశద్రోహం, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన కేసులో నిందితుడైన అబ్దుల్లా 19 సంవత్సరాల నుంచి పరారీలో ఉన్నాడు. 

ఢిల్లీలోని న్యూ ఫ్రెండ్స్ కాలనీ పోలీస్ స్టేషన్‌లో 2001లో ఈ కేసు నమోదైంది. అబ్దుల్లా ప్రకటిత నేరస్థుడని ట్రయల్ కోర్టు 2002లో ప్రకటించింది. అబ్దుల్లా ఉత్తర ప్రదేశ్, ఢిల్లీల్లో సంచరిస్తున్నట్లు దాదాపు ఓ సంవత్సరం నుంచి స్పెషల్ సెల్ ఏసీపీకి సమాచారం అందినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. 

జాతీయ పౌరుల పట్టిక (ఎన్ఆర్‌సీ), పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)లకు వ్యతిరేకంగా ముస్లిం యువతను రాడికలైజ్ చేస్తున్నాడని, వివిధ మతాల మధ్య అశాంతిని సృష్టించేందుకు హార్డ్‌కోర్ రాడికల్ ఐడియాలజీని నూరిపోస్తున్నాడని, ఫేక్ వీడియోలను చూపిస్తూ భారత ప్రభుత్వం ముస్లింలపై అరాచకాలకు పాల్పడుతోందని రెచ్చగొడుతున్నాడని  సమాచారం అందినట్లు తెలిపారు. 

అబ్దుల్లా డానిష్ ఢిల్లీలోని జకీర్ నగర్‌కు వస్తున్నట్లు సమాచారం రావడంతో ప్రత్యేకంగా సిబ్బందిని నియోగించి శనివారం ఆయనను అరెస్టు చేసినట్లు చెప్పారు.