తిరుపతి ఉపఎన్నికల్లో బిజెపి గట్టి పోటీ 

తిరుపతి లోక్ సభకు త్వరలో జరుగబోయే ఉప ఎన్నికలో గట్టి పోటీ ఇస్తామని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు  స్పష్టం చేశారు. అక్కడ బీజేపీ-  జనసేన కూటమి కలసి అనూహ్యమైన ఫలితం సాధింపగలవని ధీమా వ్యక్తం చేశారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో బీజేపీ విజయాన్ని ప్రస్తావిస్తూ  తెలంగాణ తరహాలోనే ఏపీలో కూడా బీజేపీ కచ్చితంగా విజయం సాదిస్తుందని భరోసా వ్యక్తం చేశారు. 2024 ఎన్నికల్లో ఏపీలో బీజేపీ- జనసేన కూటమి అధికారం చేపడుతుందని వెల్లడించారు. 
నిజమైన బీసీ మోదీ బీసీలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని చెబుతూ కేంద్రం ఏపీ కి 24 లక్షలు ఇళ్ళు ఇస్తే వైసీపీ ప్రభుత్వం 17 లక్షలు ఇళ్ళు మాత్రమే తీసుకుందని వీర్రాజు పేర్కొన్నారు. ఎనిమిది లక్షల ఇళ్ళు వెనక్కిపోయాయని తెలిపారు. జలమిషన్ ద్వారా కేంద్రం రాష్ట్రానికి రూ.79 లక్షలు కుళాయిలు ఇస్తే కేవలం రూ. 39 లక్షలు కుళాయిలు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందని చెప్పారు.  కేంద్రం ఇప్పటివరకూ రాష్ట్ర ప్రభుత్వానికి ఐదు వేల కోట్లు ఇచ్చిందని వెల్లడించారు.
ఈ ఏడాది మొదట్లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో ఎన్నికల కమీషనర్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి రెండు వేల ఎంపీటీసీలను ఏకగ్రీవంగా ఇచ్చేశారని వీర్రాజు ధ్వజమెత్తారు. నామినేషన్‌లు వేయకుండా చేశారని అంటూ ఈ విషయమై ఎన్నికల కమీషనర్‌ను నిలదీయాలని స్పష్టం చేశారు. ఇప్పటివరకూ జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తిగా రద్దు చేసి మళ్ళీ ఎన్నికలు నిర్వహించాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు.
 
కాగా, ఏలూరు ఆస్పత్రిలో రోగులను  సోమువీర్రాజు పరామర్శించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏలూరులో భయంకరమైన వాతావరణం నెలకొందని, ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని తెలిపారు.  ఫిట్స్‌తో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని విచారం వ్యక్తం చేశారు. 

ఒకేసారి 300కు పైగా అస్వస్థతతో తీవ్ర ఇబ్బంది పడుతున్నారని పేర్కొంటూ ఈరోగం విస్తరించకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.  కృష్ణా కాల్వలో కరోనాకు సంబంధించిన వేస్ట్ మెటీరియల్ వేస్తున్నారని దాని వల్లే ప్రమాదకర పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. 

ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని విమర్శించారు. ఏలూరులో పారిశుధ్య లోపం కారణంగానే ప్రజలు పెద్ద ఎత్తున అనారోగ్యానికి గురయ్యారని పేర్కొన్నారు. ఆస్పత్రిలో చిన్నారులు, వృద్ధులను చూస్తుంటే బాధేసిందని ఆవేదన చెందారు.  సీఎం వెంటనే ఏలూరు వచ్చి పరిస్థితిని సమీక్షించాలని కోరారు.