ఏలూరులో వందల మందికి మూర్ఛ, వాంతులు 

ఏలూరు నగరంలో వంద మందికి పైగా శనివారం ఉదయం నుండి మూర్ఛ వలే నోటి నుండి నురగ కక్కుతూ పడిపోవడం, ఆసుపత్రులలో చేరడం కలకలం సృష్టిస్తున్నది. 200 మందికి పైగా ఇలా పడిపోవడంతో ప్రతి ఒక్కరికీ సిటీస్కానింగ్‌ నిర్వహించారు. ఎలాంటి లక్షణాలు లేకపోవడంతో అంతుపట్టని వ్యాధిగా వైద్యులు పేర్కొన్నారు. 
 
ఆసుపత్రిలో చేరిన ఆరేళ్ల ప్రభ అనే బాలిక పరిస్థితి విషమంగా ఉండడంతో విజయవాడ ప్రభుత్వాసుపత్రికి పంపారు. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు ఈ వ్యాధి నిర్ధారణపై ప్రత్యేక బృందాలను సిద్ధం చేశారు. నగరంలోని దక్షిణపు వీధి ప్రాంతానికి ప్రత్యేక వైద్య బృందాలు వెళ్లి ఇంటింటి సర్వే చేపట్టారు. 
 
వారు తిన్న ఆహారం, తాగిన నీరు, పరిసరాలను పరిశీలించారు. శనివారం రాత్రికి నగరంలోని అన్ని ప్రాంతాల నుంచి ఒకొక్కరుగా ఆసుపత్రికి రావడంతో నగరం అంతా వ్యాపించిందని గుర్తించారు. అయితే గాలి కాలుష్యమా, నీటి కాలుష్యమా, దోమల వలన వచ్చిందా అనేది అంతుచిక్కలేదు. 
 
ఆసుపత్రి చీఫ్‌ ఫిజీషియన్‌ డాక్టర్‌ పోతుమూడి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు వైద్య సేవలు అందిస్తున్నాయి. 

విషయం తెలిసిన వెంటనే ఉప ముఖ్యమంత్రి,  వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని ఆయా ప్రాంతాలను శనివారం రాత్రి, ఆదివారం రాత్రి మరోసారి  పరిశీలించారు. ఆసుపత్రిలో బాధితులను పరామర్శించి ధైర్యం చెప్పారు. విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో ప్రత్యేక వార్డులు ఏర్పాటుచేయాలని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ను ఆదేశించారు. 

వైద్యులు కూడా అందుబాటులో ఉండాలని సూచించారు. ఆసుపత్రిలో చేరిన వారంతా ఆరోగ్యంగానే ఉన్నారని, 108 వాహనాలను అందుబాటులో ఉంచామని వివరించారు.  

 ఇప్పటివరకు 227 కేసులు నమోదయ్యాయని, ఇంకా మూర్ఛ, వాంతులు వంటి బాధితులు పెరుగుతున్నాయని మంత్రి తెలిపారు. ప్రభుత్వాస్పత్రిలోనే కాకుండా ప్రయివేట్ ఆసుపత్రుల్లో వీరు చేరారని చెబుతూ ఇప్పటివరకూ70 మంది పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని పేర్కొన్నారు. బాధితుల్లో 105 మంది పురుషులు, 76 మంది స్త్రీలు, 46 మంది చిన్నారులు ఉన్నారు.

ఏలూరు ఘటనపై ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫోన్‌లో ఆరా తీశారు. డిప్యూటీ సీఎం, వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఆళ్లనాని ప్రస్తుత పరిస్థితులను, బాధితుల వివరాలను సీఎం జగన్‌కు వివరించారు. ఈ సందర్భంగా సకాలంలో స్పందించి, బాధితులకు బాసటగా నిలిచి వారికి మెరుగైన వైద్యం అందించేందుకు ముందస్తు చర్యలు చేపట్టిన మంత్రి నానిని సీఎం వైఎస్‌ జగన్‌ ప్రత్యేకంగా అభినందించారు. 

ఏలూరు గవర్నమెంట్‌ ఆస్పత్రిలో వైద్యబృందం, జిల్లా యంత్రాంగం, అధికారుల పనితీరును సీఎం జగన్‌ అభినందించారు.   ఎలాంటి భయాందోళన చెందొద్దు. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు రాకుండా నిపుణులయిన వైద్య పరీక్షలు చేయిద్దాం. అవసరమయితే మెరుగైన వైద్యసదుపాయం కల్పించడం కోసం అన్ని విధాలుగా అండగా ఉంటామని సీఎం జగన్ భరోసా ఇచ్చారు.