ఏపీ విద్యుత్‌ వినియోగదారులకు డబుల్‌ షాక్‌   

ఆంధ్ర ప్రదేశ్ లో విద్యుత్‌ వినియోగదారులకు డబుల్‌ షాక్‌ తగిలేటట్టుంది. 2014-15 నుంచి 2018-19  వరకు రూ.3,013 కోట్ల ట్రూఅప్‌ చార్జీలను వసూలు చేసుకునేందుకు విద్యుత్‌ రెగ్యులేటరీ కమిషన్‌ (ఇఆర్‌సి) డిస్కాంలకు అనుమతి ఇచ్చింది. నవంబర్‌ 26న ఇఆర్‌సి ఇచ్చిన తీర్పును తన వెబ్‌సైట్‌లో ప్రచురించింది. 
 
ఇఆర్‌సి నిర్దేశించిన టారిఫ్‌లో అంచనా వేసినదానికంటె అదనంగా జరిగిన ఖర్చును ట్రూ అప్‌ చార్జీల పేరిట ఆ తరువాతి సంవత్సరంలో వసూలు చేస్తారు. అయితే 2014-15 నుంచి 2018-19 మధ్య గత ప్రభుత్వం అలాంటి ప్రతిపాదనలు సమర్పించలేదు. 
 
నాలుగేళ్ల కాలంలో ట్రూఅప్‌ చార్జీల కింద రూ.19,603 కోట్లు అనుమతించాలని ఇఆర్‌సికి డిస్కాంలు ప్రతిపాదించాయి. కాని, అందులో రూ.3,031 కోట్లకు మాత్రమే ఇఆర్‌సి అనుమతి ఇచ్చింది. వచ్చే ఏడాది వసూలు చేయాలని ప్రతిపాదించిన చార్జీలతో పాటు ట్రూఅప్‌ చార్జీల భారాన్ని కూడా వినియోగదారులపై మోపేందుకు డిస్కాంలు యోచిస్తున్నాయి. 
 
విద్యుత్‌ చార్జీల పెంపు ద్వారా రూ.1,285కోట్లు వినియోగదారుల నుంచి వసూలు చేసేందుకు ఎఆర్‌ఆర్‌ నివేదికను ఇఆర్‌సికి డిస్కాంలు ప్రతిపాదించాయి. ఈ రెండు కలిపి వినియోగదారులపై రూ.4,298కోట్ల భారం పడనుంది. అంటే ఒక ఏడాది చార్జీల పెంపుదల మొత్తానికి దాదాపు మూడు రెట్లు ట్రూఅప్‌ భారం ప్రజల నెత్తిన పడుతుంది.
 
మరోవంక, ట్రూఅప్‌ చార్జీలను కూడా 2021-22 ఆర్థిక సంవత్సరం టారిఫ్‌లోనే వసూలు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని ఇఆర్‌సిని కోరేందుకు డిస్కాంలు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాయి.