అరుణాచల్ ద‌గ్గ‌ర మూడు గ్రామాలు నిర్మిస్తున్న చైనా

స‌రిహ‌ద్దులో ల‌ఢాక్ నుంచి అరుణాచ‌ల్ వ‌ర‌కు ఏదో ఒక చోట భారత్ ను  రెచ్చగొట్టే కార్య‌క‌లాపాల‌కు చిన్నా  పాల్ప‌డుతూనే ఉంది. తూర్పు ల‌ఢాక్ ప్రాంతంలో ఆక్ర‌మ‌ణ‌కు ప్ర‌య‌త్నించి అడ్డొచ్చిన భార‌త జ‌వాన్ల‌పై దాడి చేసిన చైనా.. ఆ త‌ర్వాత వివాదాస్ప‌ద డోక్లాం ప్రాంతంలో భూటాన్ భూభాగంలో ఓ గ్రామాన్నే నిర్మించింది.

తాజాగా అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ స‌మీపంలో త‌న భూభాగంలోనే మూడు గ్రామాల‌ను నిర్మించింది. భారత్, చైనా, భూటాన్ దేశాల జంక్ష‌న్‌లో అరుణాచ‌ల్ ప్రదేశ్‌కు ప‌శ్చిమాన ఉన్న బ‌మ్ లా పాస్‌కు 5 కిలోమీట‌ర్ల దూరంలోనే ఈ గ్రామాల నిర్మాణం చేప‌ట్ట‌డం గమ‌నార్హం. అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ త‌మ భూభాగ‌మే అంటూ కొన్ని ద‌శాబ్దాలుగా చైనా పేచీ పెడుతున్న సంగ‌తి తెలిసిందే.

త‌న మ్యాప్‌లో ఈ భార‌తదేశ రాష్ట్రాన్ని ద‌క్షిణ టిబెట్‌లో భాగంగా చూపిస్తోంది. అలాంటి కీల‌క ప్ర‌దేశానికి ద‌గ్గ‌ర్లో చైనా ఈ నిర్మాణాలు చేప‌ట్ట‌డం చూస్తుంటే మ‌రోసారి ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొనే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. స‌రిహ‌ద్దులో చొర‌బాట్ల‌ను పెంచ‌డం కోసం క‌మ్యూనిస్ట్ పార్టీలోని హ‌న్ చైనీస్‌, టిబెటెన్ స‌భ్యుల‌ను భార‌త స‌రిహ‌ద్దు ద‌గ్గ‌ర మోహ‌రిస్తోందని చైనా వ్య‌వ‌హారాల ప‌రిశీల‌కుడు బ్ర‌హ్మ చెలానీ పేర్కొన్నారు.

ద‌క్షిణ చైనా స‌ముద్రంలో జాల‌ర్ల‌ను ఎలా అయితే ఉప‌యోగించుకున్న‌దో భారత్ పెట్రోలింగ్ నిర్వ‌హించే హిమాల‌య ప్రాంతాల్లో ప‌శువుల కాప‌ర్ల‌ను అలాగే వాడుకుంటోంద‌ని ఆయ‌న వెల్ల‌డించారు. ఇప్పుడు అరుణాచ‌ల్‌కు ద‌గ్గ‌ర‌లో చైనా నిర్మించిన గ్రామాలు.. దాదాపుగా తూర్పు ల‌ఢాక్‌లో ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్న‌ప్పుడు నిర్మించిన‌వే అని భావిస్తున్నారు.

ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రి 17న ఆ ప్రాంతంలో 20 నిర్మాణాల‌తో తొలి గ్రామాన్ని నిర్మించిన‌ట్లు ప్లానెట్ ల్యాబ్స్ నుంచి పొందిన ఫొటోలు స్ప‌ష్టం చేస్తున్నాయి. ఆ త‌ర్వాత న‌వంబ‌ర్ 28 నాటికి ఆ ప‌క్క‌నే మ‌రో రెండు గ్రామాలు వెలిశాయి. అందులో ఒక గ్రామంలో 50 వ‌ర‌కు నిర్మాణాలు ఉన్నాయి. ఈ మూడు గ్రామాలను ఒక్కో కిలోమీట‌ర్ దూరంలో అధునాత‌న రోడ్ల‌తో అనుసంధానించారు.