తెలంగాణలో కాషాయ జెండా ఎగరేద్దాం  

దుబ్బాక విజయం ఇచ్చిన స్ఫూర్తితో గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో మెరుగైన స్థానాలు సాధించారని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌లను కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా అభినందించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై ఇదేస్ఫూర్తితో పోరాడి 2023లో తెలంగాణ లో కాషాయ జెండా ఎగురవేద్దామని పిలుపునిచ్చారు. 

నేడు బీజేపీలో చేరడానికి సిద్ధపడిన కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ విజయశాంతి గత రాత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్, మాజీ ఎంపీ వివేక్  వెంకటస్వామి కూడా ఆమెతో పాటు ఉన్నారు. విజయశాంతికి స్వాగతం పలుకుతూ, ఆమెకు పార్టీలో తగు ప్రాధాన్యత ఉంటుందని అమిత్ షా హామీ ఇచ్చారు. 

తెలంగాణలో టీఆర్‌ఎస్‌ పై వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో హైదరాబాద్‌ వచ్చిన సందర్భంగా తనకు అర్థమైందని అమిత్ షా తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. రాబోయే రోజుల్లో బీజేపీని ఏ విధంగా బలోపేతం చేసి, అధికార పీఠం ఎక్కాలన్న అంశంపై అమిత్‌షా వారికి దిశానిర్దేశం చేశారు. గ్రామస్థాయిలో పార్టీని మరింత పటిష్టం చేయాలని సూచించారు. నాగార్జునసాగర్‌లో రానున్న ఉప ఎన్నికపైనా చర్చించారు.

కాగా, అమిత్‌ షాతో భేటీ అనంతరం బండి సంజయ్‌ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో టీఆర్‌ఎస్‌ అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై రాజీలేని పోరాటం చేస్తామని ప్రకటించారు.  బీజేపీ దూకుడు కొనసాగించాలని అమిత్‌షా సూచించారని చెప్పారు. తెలంగాణ ఉద్యమకారులను టీఆర్‌ఎస్‌ విస్మరిస్తోందని, అందుకే వారంతా బీజేపీలో చేరుతున్నారని ఆయన పేర్కొన్నారు. విజయశాంతి చేరికతో పార్టీ మరింత బలోపేతమవుతుందని భరోసా వ్యక్తం చేశారు.