హైదరాబాద్ తర్వాత బిజెపి దృష్టి ముంబై వైపు 

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల ఫలితాలు జోరుగా ఉండడంతో బిజెపి మహారాష్ట్ర నాయకత్వంలో హుషారు కనిపిస్తున్నది. ఈ జోరుతో రాబోయే బృహన్ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్ ‌(బీఎంసీ) ఎన్నికలపై దృష్టి సారించి, అక్కడ మేయర్ స్థానం పొందాలని సన్నాహాలు చేస్తున్నది.

మొదటి సారిగా బిజెపి ముంబై మేయర్ పదవి కవాసం చేసుకోగలదని  ఆ పార్టీ నాయకుడు, ఎమ్మెల్యే రామ్‌ కదం ధీమా వ్యక్తంచేశారు. చాలాకాలంగా బిజెపి మద్దతుతో శివసేన వ్యక్తే మేయర్ గా ఉంటూ వస్తున్నారు. తాజాగా పట్టభధ్రులు, ఉపాధ్యాయుల స్థానాల నుండి జరిగిన శాసనమండలి ఎన్నికలలో అధికార కూటమి చెప్పుకోదగిన విజయం సాధించడంతో బిజెపి అప్రమత్తమవుతున్నది.

‘‘ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో బిహార్‌లో బీజేపీ విజయం సాధించింది. దేశవ్యాప్తంగా చర్చల్లోకెక్కిన గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో 4 సీట్లు ఉన్న బీజేపీ 48 సీట్లను కైవసం చేసుకుని హైదరాబాద్‌లో పాగా వేసింది. అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్‌ఎస్‌తోపాటు ఎంఐఎంకు గట్టి పోటీ నిచ్చి బీజేపీ తన సత్తాను చాటుకుంది” అని రామ్ కదం చెప్పారు.

 దీంతో ముంబైతోపాటు మహారాష్ట్ర బీజేపీలో నూతన ఉత్తేజం నిండింది. ఇదే ఉత్తేజాన్ని బృహన్ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల వరకు కొనసాగుతుందని ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ (బీఎంసీ)లో బీజేపీ తన జెండా ఎగురవేస్తుందని రామ్‌ కదం భరోసా వ్యక్తం చేశారు. 

బీఎంసీని కైవసం చేసుకునేందుకు ‘మిషన్‌ ముంబై’ ప్రారంభించినట్లు ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌ ఇటీవలే ప్రకటించారు. దీంతో ముంబైలోని బీజేపీ కార్యకర్తలు ఇప్పటి నుంచే బీఎంసీ ఎన్నికల కోసం సిద్దమవుతున్నట్టు తెలిసింది.  

హైదరాబాద్‌ ఎన్నికల్లో బిజెపి అగ్రనాయకులు – అమిత్ షా, జెపి నడ్డా, యోగి ఆదిత్యనాథ్, దేవేంద్ర ఫడ్నవిస్, స్మ్రితా ఇరానీ, ప్రకాష్ జావడేకర్, భూపేష్ యాదవ్ వంటి వారు పాల్గొనడం గమనార్హం. 

 
ముంబైలో కూడా ఇటువంటి వ్యూహమే అనుసరించే అవకాశం ఉంది. రాబోయే బీఎంసీ ఎన్నికల్లో బీజేపీ ప్రచారం చేసి మెజార్టీ సీట్లు కైవసం చేసుకునేందుకు బిజెపి ప్రణాళిక సిద్దం చేస్తున్నట్లు తెలుస్తున్నది.

రాష్ట్రంలో జరిగిన పట్టభద్రులు, ఉపాధ్యాయ నియోజకవర్గాల్లో బీజేపీ నాగ్‌పూర్, పుణే, ఔరంగాబాద్‌ మొదలగు పెట్టనికోటగా ఉన్న స్థానాలను కోల్పోయింది.
మహావికాస్‌ ఆఘాడీ ఐక్యతతో పోరాడటంతో బీజేపీపై విజయం సాధించగలిగారు. 
 
ఇలాటి నేపథ్యంలో బీఎంసీలో కూడా శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌లు ఒక్కటిగా మహావికాస్‌ ఆఘాడిగానే పోటీ చేయాలని భావిస్తున్నాయి. దానితో మహావికాస్‌ ఆఘాడీని భారీ షాక్ ముంబైలో ఇవ్వడం కోసం బిజెపి సన్నాహాలు చేస్తున్నది.