ఇండియా కూటమిలో కాంగ్రెస్- సిపిఎం మధ్య అగాధం

ఇండియా కూటమిలో కాంగ్రెస్- సిపిఎం మధ్య అగాధం
కేరళలో వామపక్ష పార్టీ పట్ల కాంగ్రెస్ నాయకత్వం అనుసరిస్తున్న వైఖరిని సీపీఎం ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ బహిరంగంగా ప్రశ్నించడంతో, ప్రతిపక్ష ఇండియా కూటమిలోని విభేదాలు, ముఖ్యంగా కాంగ్రెస్- సిపిఎం మధ్య పెరుగుతున్న అగాధం మరోసారి వెలుగులోకి వచ్చింది. ఈ విషయంపై మాట్లాడుతూ, కేరళ ఎన్నికల ప్రచారాల సందర్భంగా కాంగ్రెస్ నాయకులు చేసిన వ్యాఖ్యలపై బేబీ నిరాశ వ్యక్తం చేశారు.
 
రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే సహా పలువురు కాంగ్రెస్ నాయకులు, సీపీఎం నేతృత్వంలోని లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎల్‌డీఎఫ్)కు బీజేపీతో రహస్య అవగాహన ఉందని పదేపదే ఆరోపించారని ఆయన గుర్తు చేశారు.  కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి)కి ‘సహాయకారి’గా వ్యవహరించడం రాహుల్‌ ‌గాంధీ మానుకోవాలని హితవు పలికారు.
 
ఇటీవల జరిగిన ‘ఇండియా’ కూటమి సమావేశంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. పినరయి విజయన్‌తో తనకు రాజకీయ విభేదాలున్నాయని, అందుకే తాను ఆయనను “కౌగిలించుకోలేనని” పేర్కొనడాన్ని ఖండిస్తూ ఎంఎ బేబీ సామాజిక మాధ్యమాల్లో శఒక పోస్టు చేశారు. ఇటీవల జరిగిన కేరళం అసెంబ్లీ ఎన్నికల సమయంలో సిపిఎం, బిజెపి మధ్య రహస్య ఒప్పందం ఉందంటూ రాహుల్ గాంధీ, ఇతర కాంగ్రెస్ నేతలు  ప్రచారం చేశారు. 
 
దీనిపై సిపిఎం ఎంపి జాన్ బ్రిట్టాస్ తదితర వామపక్ష నాయకులు ‘ఇండియా’ సమావేశంలో నిలదీశారు. దీనిపై స్పందించిన రాహుల్ తాను పినరయ్ విజయన్‌‌తో రాజకీయ పోరాటం చేస్తున్నానని, ఆయనను కౌగలించుకోవాల్సిన అవసరం లేదని విపరీత వ్యాఖ్యలు చేశారు. రాహుల్‌ ‌వ్యాఖ్యలను నాటి సమావేశంలోనే జాన్‌‌బ్రిట్టాస్‌ ఖండించారు. 
 
అంతకు ముందు ఇదే ప్రచారంపై కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షు‌లు ఖర్గేకు ఎంఎ బేబీ లేఖ ద్వారా నిరసన తెలిపారు. అందులో రాహుల్‌ ‌ప్రవర్తన, ఆయన వ్యాఖ్యలు భాగస్వామ్య పక్షాల మధ్య ఉండాల్సిన సహకార స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నాయని బేబీ ఆరోపించారు. బిజెపిని ఎదుర్కోవడానికి అందరం కలిసి వచ్చినప్పుడు, ఒకరిపై ఒకరు ఇలాంటి తప్పుడు ఆరోపణలు సరికాదని హితవు పలికారు. అయితే ఈ లేఖపై కాంగ్రెస్‌ ‌స్పందించలేదు.
 
రాజకీయ ప్రత్యర్థులైనప్పటికీ, రాహుల్ గాంధీ పార్లమెంటులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని బహిరంగంగా ఆలింగనం చేసుకున్నారని గుర్తుచేస్తూ,  బేబీ ఈ వాదనను ప్రశ్నించారు. పార్టీలకు అతీతంగా ఇలాంటి ఆలింగనాలు సాధ్యమైనప్పుడు, విస్తృత ప్రతిపక్ష శిబిరంలో భాగమైన నాయకులకు దూరంగా ఉండటానికి రాజకీయ విభేదాలను కారణంగా చూపడం పట్ల విస్మయం వ్యక్తం చేశారు.
 
కేరళ ఎన్నికల ప్రచారాల సందర్భంగా పినరయి విజయన్‌ను అరెస్టు చేయాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేయడాన్ని కూడా ఈ సీపీఎం నాయకుడు వ్యతిరేకించారు. జాతీయ స్థాయిలో బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లకు వ్యతిరేకంగా ఐక్యంగా ఉన్నామని చెప్పుకుంటూనే, ఒకే ప్రతిపక్ష కూటమిలో భాగమైన పార్టీల నాయకులు ఒకరిపై ఒకరు ఇలాంటి ఆరోపణలు చేసుకోవడం ఆశ్చర్యంగా ఉందని ఆయన పేర్కొన్నారు. 
 
ప్రతిపక్ష ఐక్యతను బలోపేతం చేయాలనుకుంటే, ఇండియా కూటమిలోని అన్ని పార్టీలు ఆత్మపరిశీలన చేసుకోవాలని బేబీ స్పష్టం చేశారు. రాష్ట్ర స్థాయిలో ఉన్న విభేదాలు, జాతీయ స్థాయిలో బీజేపీని సవాలు చేయాలన్న కూటమి బృహత్ లక్ష్యాన్ని బలహీనపరచకుండా ఉండేందుకు, ప్రతి భాగస్వామ్య పార్టీ తన చర్యలను, మాటలను సమీక్షించుకోవాలని ఆయన హితవు చెప్పారు.
 
జూన్ 8న న్యూఢిల్లీలో ఇండియా కూటమి సమావేశం జరిగిన కొద్ది రోజుల తర్వాత ఈ వ్యాఖ్యలు వెలువడ్డాయి. బీజేపీకి వ్యతిరేకంగా కూటమి ఐక్యంగా ముందుకు రావడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ, బేబీ వ్యాఖ్యలు దానిలోని కొందరు కీలక సభ్యుల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు, విభేదాలపై వెలుగునిచ్చాయి.
 
రాజకీయ వైఖరి ఇండియా కూటమిని బలోపేతం చేయడం లేదని, తరచూ అది అంతిమంగా బీజేపీకే లబ్ధి చేకూరుస్తున్నదని  సిపీఎం అగ్ర నేత పినరయి విజయన్‌ శనివారం విమర్శలు గుప్పించారు. కేరళలో ఎన్నికల సందర్భంగా ఏర్పడిన రాజకీయ వైరం కారణంగా తాను విజయన్‌ను ఆలింగనం చేసుకోనని ఇటీవల జరిగిన ఇండియా కూటమి సమావేశంలో రాహుల్‌ గాంధీ వ్యాఖ్యానించారా? అనే దానిపై విజయన్‌ మాట్లాడుతూ ప్రస్తుతం డీఎంకే వైఖరి ఏమిటో మనమందరం చూశామని గుర్తు చేశారు. ఇలాంటి పరిస్థితి ఏర్పడటానికి కాంగ్రెస్‌, ముఖ్యంగా రాహుల్‌ గాంధీ వైఖరే కారణమని ఆయన ఆరోపించారు.
మరోవంక,  సిపిఎం సీనియర్ నేత పినరయి విజయన్ ను ఉద్దేశించి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను సిపిఎం సీనియర్ నేత  బృందాకారత్   తీవ్రంగా తప్పుపట్టారు. తమకు ఎవరి నుండి ఎటువంటి కౌగిలింతలు అవసరం లేదని, కమ్యూనిస్టులు కౌగిలింతలను కోరుకోరని పేర్కొంటూ  తాము నిబద్ధత కలిగిన రాజకీయాలను కోరుకుంటామని చెప్పారు. 
 
ప్రతిపక్షాలను విచ్ఛిన్నం చేసేందుకు బిజెపి-ఆర్ఎస్‌ఎస్‌లు రాజకీయాలు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ రాహుల్ గాంధీ కేరళంకు వచ్చి, రాజకీయం పేరిట అత్యంత గౌరవనీయులైన నేత పినరయి విజయన్ పై దాడి చేస్తారని, తిరిగి బిజెపి-ఆర్ ఎస్ ఎస్ కు వ్యతిరేకంగా అన్నీ పార్టీలు ఐక్యం కావాలని కోరుకుంటారని ఆమె విస్మయం వ్యక్తం చేశారు. ఇది పూర్తిగా ద్వంద్వ ప్రమాణమని మండిపడ్డారు. 
 
“రాహుల్ గాంధీజీ .. మీ కౌగిలింతలు మీ దగ్గరే ఉంచుకోండి. కానీ ప్రతిపక్ష నాయకుడిగా, బిజెపి -ఆర్ఎస్‌ఎస్‌లకు వ్యతిరేకంగా తమ జీవితంలో అధిక భాగం కార్మిక వర్గం కోసం పోరాడిన పినరయి విజయన్ వంటి ప్రతిపక్ష నేతలను గౌరవించండి” అని ఆమె హితవు పలికారు.