భారత్ బంద్ కు టీఆర్ఎస్ మద్దతుపై బిజెపి ఎద్దేవా 

ఈనెల 8వ తేదీన కొన్ని  రైతు  సంఘాలు, ముఖ్యంగా  పంజాబ్ కు చెందిన రైతు  సంఘాలు,  కాంగ్రెస్ అనుబంధ రైతు సంఘాలు ప్రకటించిన భారత్ బంద్ కు టీఆర్ఎస్ పార్టీ మద్దతు  ఇవ్వడాన్ని బిజెపి  తీవ్రంగా ఖండించింది. తెలంగాణ ప్రజలు ఎవ్వరు ఈ బంద్ లో పాల్గొనవద్దని బిజెపి విజ్ఞప్తి చేసింది. 
 
కాంగ్రెస్ పార్టీకి, టీఆర్ఎస్ పార్టీకి తేడా లేదని ఈ బంద్ ద్వారా అర్థమవుతోందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ఎద్దేవా చేశారు. తెలంగాణ  రాష్ట్రంలో  ఆరు  సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్న  టీఆర్ఎస్  పార్టీ  రైతులకు  ఒరగబెట్టింది  ఏంటో ముందు స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 
 
2014 ఎన్నికల సందర్భంగా  టీఆర్ఎస్ పార్టీ రైతుల పంట  రుణాలు మాఫీ చేస్తానని వాగ్ధానంచేసి 2019 వరకు విడతలవారీగా మాఫీ చేసిందని చెప్పారు. 2018లో మరోసారి రైతు రుణాలు మాఫీ చేస్తానని వాగ్ధానంచేసి అధికారంలోకి వచ్చి రుణమాఫీ సంగతి మర్చిపోయారని ధ్వజమెత్తారు. 
.
ముందు తెలంగాణ రైతులకు మీరు  రుణమాఫీ చేసి, ఆ  తర్వాత రైతు  సమస్యలపై  స్పందిస్తే బాగుండేదని సంజయ్ హితవు చెప్పారు. అట్లాగే,  రైతుబంధు సర్వరోగ నివారిణి అని టీఆర్ఎస్ ప్రభుత్వం భావిస్తోందని చెబుతూ 
ఇప్పటికైనా రైతుల రుణమాఫీ ఆలస్యం  కావడం పట్ల రైతులకు  క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 
 
తెలంగాణలో రూ.  లక్ష  లోపు  వడ్డీలేని రుణాలు  ఇవ్వాల్సి  ఉండగా రాష్ట్ర ప్రభుత్వం తన వాటా  ఇవ్వని కారణంగా రైతులు 13 శాతం  వడ్డీలు చెల్లిస్తున్నారని సంజయ్ తెలిపారు. తెలంగాణ  రాష్ట్రంలో  ఫసల్ బీమా యోజన అమలు కావడం లేదని, ఫలితంగా  రైతులు అకాల వర్షాలు,  కరువుతో తీవ్రంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు. 
 
టీఆర్ఎస్  ప్రభుత్వానికి రైతుల పట్ల ఉన్న ప్రేమ  ఇదని అంటూ తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ యాంత్రీకరణకు నిధులు  లేవని, సూక్ష్మ సేద్యానికి నీళ్లు  ఇవ్వడం లేదని ధ్వజమెత్తారు. కేంద్రం ఇస్తున్న నిధులతో టీఆర్ఎస్ నాయకులకు ట్రాక్టర్లు కొనిస్తున్నారని దుయ్యబట్టారు.
 
ఇప్పటికైనా రైతు సంక్షేమం  కోసం తెలంగాణ ప్రభుత్వం నిధులు  విడుదల చేసి ఫసల్ బీమా యోజన, వ్యవసాయ యాంత్రీకరణ, సూక్ష్మ  సేద్యం  లాంటి పథకాలను  అమలు  చేయాలని సంజయ్ డిమాండ్ చేశారు. అప్పటివరకు రైతుల గురించి  మాట్లాడే  నైతిక  హక్కు టీఆర్ఎస్  ప్రభుత్వానికి  లేదని స్పష్టం చేశారు. 
 
తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ మార్కెట్  కమిటీల్లో మీ తాబేదార్లను, మీ పార్టీ నాయకులను నియమించుకొని రైతులకు అన్యాయం చేస్తున్నారని అధికార పార్టీని నిలదీశారు. మీ మార్కెట్ కమిటీ చైర్మన్లు, సభ్యులు  దళారులతో కుమ్మక్కై  రైతులకు గిట్టుబాటు ధర రాకుండా అవినీతికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. 
 
దీన్ని ప్రశ్నించిన  రైతులను  జైళ్లపాలు చేస్తున్నారని అంటూ ఇప్పటికైనా  మీకు దమ్ము,  ధైర్యం  ఉంటే మీ  మార్కెట్  కమిటీలను రద్దు  చేసి రైతు  సంఘాలకే మార్కెట్  కమిటీల నిర్వహణను  అప్పజెప్పాలని సంజయ్ సవాల్ చేశారు.  
 
పార్లమెంట్  లో ఆమోదం పొందిన బిల్లుల  పట్ల టీఆర్ఎస్ ప్రభుత్వం అవగాహన  లేకుండా మాట్లాడటం, కాంగ్రెస్  పార్టీ ప్రేరిత బంద్  లో పాల్గొనడం టీఆర్ఎస్ పార్టీ యొక్క  రాజకీయ దివాళాకోరుతనాన్ని బయటపెడుతోందని ధ్వజమెత్తారు.
రాజకీయ అవసరాల  కోసం రైతులను రెచ్చగొట్టొద్దని హితవు చెప్పారు.