మహిళలపై దాడి.. రాజధానిలో ఆందోళనలు

ఏపీ రాజధాని అమరావతి పరిధిలోని ఉద్దండరాయునిపాలెంలో ఆదివారం రైతులపై జరిగిన రాళ్ల దాడిని నిరసిస్తూ తుళ్లూరులో రైతులు, మహిళలు చేపట్టిన ఆందోళన కొనసాగుతోంది. రాత్రంతా వీళ్లు రహదారిపైనే నిరసన తెలిపారు. దాడికి పాల్పడిన వారిని అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. 
 
మూడు రాజధానులకు వ్యతిరేకంగా నిరసన తెలిపేందుకు ఏర్పాటు చేసిన శిబిరాన్ని తొలగించబోమని రైతులు స్పష్టం చేస్తున్నారు. దాడికి వ్యతిరేకంగా ఇవాళ రాజధాని పరిధిలోని అన్ని గ్రామాల్లో నిరసన కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తుళ్లూరులో భారీగా పోలీసులను మోహరించారు.
 
 రైతులు రోడ్డుపై ఆందోళన విరమించాలని దీక్షా శిబిరంలో ఆందోళన చేసుకోవాలని డీఎస్పీ జగన్నాథం సూచించారు. అయితే తమ ప్రాణాలకు పోలీసులు భరోసా ఇవ్వాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. డీజీపీ వచ్చి హామీ ఇచ్చే వరకూ ఆందోళన విరమించేది లేదని వాళ్లు చెబుతున్నారు. 
 
ప్రభుత్వం అండతో ఉద్యమం చేసేవాళ్లతోనూ తన్నులు తినాలా? అని రైతులు ప్రశ్నిస్తున్నారు. తమ భూముల్లో ధర్నా చేసేందుకు వారికి ఎలా అనుమతి ఇస్తున్నారని అధికారులను నిలదీస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎండలో కూర్చుని ఆందోళన చేస్తూ ఉద్దండరాయునిపాలెం గ్రామ మహిళ కింద పడిపోయింది. వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు.