ఏలూరుకు అత్యవసరంగా కేంద్ర వైద్య బృందం

వింత వ్యాధితో ప్రజలను వణికిస్తున్న ఏలూరులో అసలేమీ జరిగిందో తెలుసుకోవడానికి కేంద్రం కేంద్ర వైద్య బృందాన్ని అత్యవసరంగా పంపనున్నది. రేపు అనగా మంగళవారం ప్రజల ఆకస్మిక అనారోగ్యంపై ఈ బృందం విచారణ చేయనున్నది.
 
ఈ బృందంలో డాక్టర్ జంషెడ్ నాయర్, అసోసియేట్ ప్రొఫెసర్, డాక్టర్ అవినాష్ డియోష్టవర్, వైరాలజిస్ట్, డాక్టర్ సంకేత్ కులకర్ణి ఉన్నారు. వీరంతా రేపు సాయంత్రం నాటికి ప్రాథమిక నివేదికను సమర్పించాలని కేంద్రం ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (పిహెచ్ డివిజన్) నుంచి ఈ బృందానికి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇప్పటికే మంగళగిరి ఎయిమ్స్‌ వైద్యుల బృందం ఏలూరులో పర్యటిస్తోంది. 
 
వ్యాధి నిర్థారణకు 8 మంది సభ్యుల బృందం వచ్చింది. రోగుల నుంచి రక్త నమూనాలు సేకరించింది. అయితే బాధితుల్లో ఎక్కువ మంది ఇమ్యూనిటీ తక్కువ ఉన్నవారేనని, వారికి ఎలాంటి ఇన్ఫెక్షన్‌ లేదని ఎయిమ్స్‌ వైద్యులు తెలిపారు.  రక్త నమూనాలు సేకరించి ఢిల్లీ ఎయిమ్స్‌కు పంపించామని, రిపోర్టుల ఆధారంగా వ్యాధిని నిర్థారిస్తామని ఎయిమ్స్‌ వైద్యులు పేర్కొన్నారు.  
కాగా, తెలుసుకోవడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) నుంచి వైద్య బృందం కూడా మంగళవారం నాడు ఏలూరుకు రానుంది. ఈ బృందం ఏలూరులో వింత వ్యాధిగా సంచలనం రేపుతున్న వైనంపై అధ్యయనం చేయనుంది. ఈ బృందంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధులు ఉన్నారని వైద్య అధికారులు మీడియాకు సమాచారం ఇచ్చారు. ప్రపంచ దేశాల దృష్టి పడటంతో వ్యాధిని నిర్ధారించేందుకు డబ్ల్యూహెచ్‌వో బృందం రానుంది.
 
రెండ్రోజులుగా ఏపీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని ఏలూరులోనే ఉన్నారు. ఇవాళ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా ఏలూరుకు వెళ్లి పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. వింత వ్యాధితో బాధితుల సంఖ్య  పెరుగుతుండడంతో అధికారులతో సీఎం సమీక్ష జరుపుతున్నారు. అన్ని విధాలుగా అండగా ఉంటామని బాధితులకు భరోసా ఇచ్చారు. వ్యాధి కారణాలు, తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.
మూడు రోజుల వ్యవధిలోనే 443 మందికి పైగా ఆస్పత్రిపాలయ్యారు. వీరిలో 243 కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. 16 మందిని విజయవాడకు తరలించారు. ప్రస్తుతం ఏలూరు ఆసుపత్రిలో 183 మంది చికిత్స పొందుతున్నారు.