పార్లమెంటు కొత్త భవనానికి 10న మోదీ శంకుస్థాపన 

కొత్త పార్లమెంటు భవనానికి ప్రధాని నరేంద్ర మోదీ ఈనెల 10వ తేదీన శంకుస్థాపన చేస్తారు. భూమి పూజ జరుపుతారని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా  తెలిపారు. శంకుస్థాపన ఉత్సవం జరిపే ప్రదేశాన్ని నిర్ణయించేందుకు గత వారంలో అధికారులతో కలిసి ఓం బిర్లా ఆ ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. 

శంకుస్థాపన కోసం లాంఛనంగా ప్రధానిని ఓం బిర్లా ఆహ్వానించినట్టు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఈనెలలోనే కొత్త పార్లమెంటు భవన నిర్మాణం పనులు మొదలవుతాయి. లోక్‌సభ ఛాంబర్‌లో ప్రస్తుతం 543 సభ్యులకు అవసరమైన సీటింగ్ కెపాసిటీ ఉండగా, కొత్త భవంతిలో సీట్ల సామర్థ్యం 888 వరకూ ఉంటుంది. రాజ్యసభ ఛాంబర్‌లోనూ 245 మంది సభ్యులకు ప్రతిగా 384 సీట్లు ఏర్పాటు చేస్తారు.

సంయుక్త సమావేశాలకు గాను లోక్‌సభ ఛాంబర్ సామర్థ్యం 1,272 సీట్ల వరకూ ఉంటుంది. రెండేళ్లలోపే నూతన పార్లమెంటు భవన నిర్మాణం పూర్తవుతుందని, 75వ భారత స్వాంతత్య్ర  దినోత్సవం నాటికి పార్లమెంటు భవనం ముస్తాబవుతుందని కొత్త కార్యాలయం బాధ్యతలు చేపట్టిన సెక్రటరీ జనరల్ ఉత్పల్ కుమార్ సింగ్ తెలిపారు.

ప్రతిపాదిత పార్లమెంటు భవనం 64,500 చదరపు మీటర్ల ఏరియాలో నిర్మితమవుతుంది. పార్లమెంటు భవన నిర్మాణ పనుల కాంట్రాక్టును హెచ్‌సీపీ డిజైన్, ప్లానింగ్ అండ్ మేనేజిమెంట్ ప్రైవేట్ లిమిటెడ్ సొంతం చేసుకుంది. ఇందులో నాలుగు అంతస్తులు ఉంటాయి. 

రాష్ట్రపతి, ప్రధాని, లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ చైర్‌పర్సన్లు, ఎంపీలు, ప్రజలు భవంతిలోకి అడుగుపెట్టేందుకు వేర్వేరు మార్గాలు ఉంటాయి. పేపర్ రహిత కార్యాలయంగా తీర్చిదిద్దేందుకు డిజిటల్ ఇంటర్‌ఫేస్‌లు ఏర్పాటు చేస్తారు. ఎంపీలు, మంత్రుల కార్యాలయాలతో పాటు, రాజ్యాంగాన్ని షోకాజ్ చేసే రాజ్యాంగ హాలును కూడా భవంతిలో ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తారు.