అసంసోల్‌లో బీజేపీ ర్యాలీపై కాల్పులు

భారతీయ జనతా పార్టీ ర్యాలీపై శనివారంనాడు కొందరు అగంతకులు బాంబులు రువ్వుతూ, కాల్పులు జరిపారు. పశ్చిమబెంగాల్‌లోని అసంసోల్‌లో ఈ ఘటన చేటుచేసుకుంది. కాల్పుల్లో గాయపడిన ఇద్దరిని ఆసుపత్రికి తరలించారు. బరబనీ ప్రాంతంలో ర్యాలీకి హాజరైన కొందరిని టార్గెట్ చేసుకుని అగంతకులు క్రూడ్ బాంబులు విసిరి, కాల్పులు జరిపినట్టు పోలీసులు తెలిపారు.

కాగా, తాము ర్యాలీ నిర్వ‌హిస్తుండ‌గా తృణ‌మూల్ గూండాలు త‌మ‌పై బాంబు విసిర దాడి చేశార‌ని, ఈ దాడిలో త‌మ కార్య‌క‌ర్తలు ఏడుగురికి గాయాల‌య్యాయ‌ని బీజేపీ స్థానిక నేత ల‌ఖ‌న్ గౌరీ చెప్పారు. తృణ‌మూల్ కార్య‌క‌ర్త‌లు త‌మ‌పై దాడి చేస్తున్న‌ప్పుడు అక్క‌డే ఉన్న పోలీసులను స‌హాయం కోరినా వారు స్పందించ‌లేద‌ని ల‌ఖ‌న్ గౌరీ ఆరోపించారు.

రాజకీయ హింసకు పాల్పడటం ద్వారా రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ముందు విపక్షాలను బెదిరించాలని అనుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. ఘటన నేపథ్యంలో పోలీసులు పెద్దఎత్తున అక్కడకు చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు. ఘటనా స్థలి వద్ద నాటు బాంబులను స్వాధీనం చేసుకున్నారు.

కాగా, అసంసోల్‌పై బీజేపీ ర్యాలీపై అగంతకులు దాడులు జరపడంపై బీజేపీ ప్రధాన కార్యదర్శి, పశ్చిమబెంగాల్ ఇన్‌చార్జి కైలాష్ విజయవర్గీయ మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపడతామని అన్నారు. నేరగాళ్లతో పోలీసులు కుమ్మక్కయ్యారని, అసంసోల్‌లో బీజేపీ ర్యాలీ జరుగుతున్న విషయం పోలీసులకు తెలుసునని ఆయన ఆరోపించారు.

పోలీసుల కళ్ల ముందే గూండాలు బాంబులు విసరడం, బుల్లెట్లు పేల్చడం ఒక్క బెంగాల్‌లో మాత్రమే జరుగుతుందని ఆయన విమర్శించారు. మరోవైపు, విపక్షాల ఆరోపణలను టీఎంసీ ప్రతినిధి కునల్ ఘోష్ తోసిపుచ్చారు. బీజేపీలో అంతర్గత విభేదాలే ఘర్షణలకు కారణమని, అధికార పార్టీ (టీఎంసీ) ప్రమేయం ఏమీ ఇందులో లేదని చెప్పారు.