9న రైతు నేతలతో మరో విడత కేంద్రం చర్చలు

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న రైతు సంఘాలతో కేంద్ర ప్రభుత్వం ఈ నెల 9న మరో విడత చర్చలు జరుపనున్నది. శనివారం జరిగిన ఐదో విడత చర్చల్లో కూడా ఎలాంటి పురోగతి లేదు. వ్యవసాయ  చట్టాలను వెనక్కి తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తుండగా సవరణలకు కేంద్రం మొగ్గుచూపుతున్నది. ఈ నేపథ్యంలో చర్చల్లో అనిశ్చితి కొనసాగుతున్నది. 
 
ఒక ప్రతిపాదనను పంపుతామని కేంద్ర ప్రభుత్వం తమకు తెలిపిందని చర్చల అనంతరం రైతు సంఘాల నేతలు చెప్పారు. ఆ ప్రతిపాదనపై తమతోపాటు రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదించిన తర్వాత ఈ నెల 9న ఒక సమావేశాన్ని నిర్వహిస్తామని కేంద్రం వెల్లడించిందని పేర్కొన్నారు.
 
కనీస మద్దతు ధరపైనా చర్చ జరిగిందని, అయితే చట్టాలను వెనక్కి తీసుకునే అంశంపై మాట్లాడాలని తాము చెప్పినట్లు భారతీయ కిసాన్‌ యూనియన్‌ ప్రతినిధి రాకేశ్‌ తికైత్‌ తెలిపారు. ప్రకటించిన మాదిరిగానే ఈ నెల 8న భారత్‌ బంద్‌ ఉంటుందని ఆయన చెప్పారు. 
కాగా, నాలుగో విడత చర్చలకు సంబంధించిన మినిట్స్‌ను రైతు ప్రతినిధులకు కేంద్రం ఈ సందర్భంగా అందజేసింది. అంశాల  వారీగా లిఖిత పూర్వక సమాధానాలు ఇవ్వాలని గత సమావేశంలో రైతు ప్రతినిధులు కేంద్రాన్ని కోరారు. ఐదో విడత చర్చల్లో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, ఆహార, రైల్వే శాఖ మంత్రి పీయూష్ గెయెల్ ప్రభుత్వం తరఫున ప్రతినిధులుగా వ్యవహరించారు.
ఈ సమావేశానికి ముందు, ప్రధాని నరేంద్ర మోదీని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఇతర మంత్రులు కలుసుకున్నారు. రైతు ప్రతినిధులతో ఇంతవరకూ జరిగిన చర్చల వివరాలను ప్రధానికి వివరించారు.  తాజా పరిస్థితులు, తదుపరి కార్యాచరణపై వారు చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.

రైతు సంఘాలు లేవనెత్తుతున్న డిమాండ్లు, చట్టాల రద్దు డిమాండ్లపై వ్యవహరించాల్సిన తీరుపై ప్రధాని మంత్రులతో చర్చించినట్లు తెలుస్తోంది. రైతుల ఆందోళనపై ప్రధాని తన మంత్రులతో చర్చలు జరపడం ఇదే మొదటిసారి. సంక్షోభాన్ని అంతమొందించాల్సిన ప్రాధాన్యతను గుర్తించే ప్రధాని స్వయంగా రంగంలోకి దిగి మంత్రులతో చర్చలు జరిపి ఉంటారని పరిశీలకులు భావిస్తున్నారు.