హరిద్వార్ నుంచి నడ్డా 120 రోజుల దేశవ్యాప్త యాత్ర 

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా 120 రోజుల దేశవ్యాప్త టూర్ హరిద్వార్ నుంచి ప్రారంభించారు. హరిద్వార్‌లోని శాంతికుంజ్‌లో దేవ్ సంస్కృతి విశ్వవిద్యాలయాన్ని ఆయన శుక్రవారం  సందర్శించారు. పార్టీ పటిష్టతే లక్ష్యంగా ఆయన ఈ దేశవ్యాప్త పర్యటన జరుపుతున్నారు.

2024 లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని, 2019లో ఓటమి చవిచూసిన నియోజకవర్గాల్లో పర్యటించేందుకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ నడ్డా పర్యటన సాగనుంది.
 
‘శాంతికుంజ్‌లో గురువుల ఆశీర్వాదంతో నా యాత్ర ప్రారంభించాను. అన్ని రాష్ట్రాల్లోనూ పార్టీ పటిష్టత లక్ష్యంగా పర్యటన సాగుతుంది’  అని నడ్డా తెలిపారు. హరిద్వార్ పర్యటన సందర్భంగా ‘హర్ కి పౌరి ఘాట్’ వద్ద గంగా హారతిలో నడ్డా పాల్గొన్నారు. 
 
కాగా, నడ్డా తన దేశవ్యాప్త పర్యటనలో భాగంగా ఆయా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల సన్నాహకాలను సమీక్షిస్తారని, ఎమ్మెల్యేలు, నేతలతో చర్చలు జరపడంతో పాటు అట్టడుగు స్థాయి కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అర్జున్ సింగ్ తెలిపారు. 
 
పెద్ద రాష్ట్రాల్లో 3 రోజులు, చిన్న రాష్ట్రాల్లో 2 రోజులు ఆయన పర్యటన సాగుతుంది. పర్యటనలో భాగంగా పార్టీ సోషల్ మీడియా వలంటీర్లను కూడా నడ్డా కలుస్తారు.