రాహుల్ ను దేశాధినేతగా అంగీకరించలేం 

కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీని దేశాధినేతగా అంగీకరించేందుకు ఆయన స్థిరత్వంలేని తత్వం అడ్డుగా ఉందని నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్‌సిపి) అధినేత ‌ శరద్‌ పవార్‌ వ్యాఖ్యానించారు. 

మఠారి వార్తా పత్రిక లోక్‌ మాత్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాహుల్‌ను నాయకుడిగా స్వీకరించడానికి దేశం సిద్ధంగా ఉందా అన్న ప్రశ్నకు ఆయన ఈ విధంగా స్పందించారు. 

అదేవిధంగా అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా రాహుల్‌పై చేసిన వ్యాఖ్యలను కూడా తోసిపుచ్చారు. ఇటీవల ఒబామా రాసిన ‘ ఎ ప్రామిస్‌ ల్యాండ్‌’ పుస్తకంలో సైతం రాహుల్‌పై ప్రతికూలంగా స్పందించిన సంగతి విదితమే. 

ఎదుటవారిని ఆకట్టుకునేందుకు రాహుల్‌ పనిని త్వరగా పూర్తి చేయాలని భావిస్తారని, కానీ ఏ విషయాన్ని నేర్చుకోలేడంటూ పేర్కొన్న సంగతి విదితమే. ఒత్తిడికి గురి అవుతారని, నైపుణ్యత లేదంటూ ఒబామా రాసుకున్న వ్యాఖ్యలపౖౖె పవార్‌ను ప్రశ్నించగా ఒకరి విమర్శలను అందరూ అంగీకరించాల్సిన అవసరం లేదని చెప్పారు. 

దేశంలోని నాయకత్వంపై ఏదైనా చెప్పగలనని, అదే ఇతర దేశాల నాయకత్వంపై తానేమీ స్పందించలేనంటూ తెలిపారు. అయితే కాంగ్రెస్‌ భవితవ్యంకు రాహుల్‌ గాంధీ అడ్డుకట్టగా మారనున్నారన్న వ్యాఖ్యలపై స్పందిస్తూ దేశంలోని ఏ పార్టీలోనైనా అధినాయకత్వం అనేది అక్కడ తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఉంటుందని చెప్పారు.

కాంగ్రెస్‌ చీఫ్‌ సోనియా గాంధీతో పాటు ఆ కుటుంబంతో విబేధాలు ఉండవచ్చునని, కానీ, పలువురు కాంగ్రెస్‌ నేతలు గాంధీ-నెహ్రు కుటుంబాలతో అదే అనుబంధం కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు.