
జమ్మూకాశ్మీర్ లో అధికరణం 370 రద్దు తర్వాత జరుగుతున్న మొదటి స్థానిక ఎన్నికల ప్రచారాన్ని బిజెపి తరఫున కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వి వరుస ర్యాలీలు, బహిరంగ సభలతో ప్రారంభించారు. ఇంటర్నెట్ పై నిషేధాజ్ఞలు, కోవిడ్ కారణంగా నెలకొన్న ఆర్ధిక సంక్షోభం ఫలితంగా తాము పడుతున్న ఇబ్బందులను, కష్టాలను ప్రజలు చెబుతుంటే ఆయన శ్రద్దగా వింటున్నారు. అధికరణం 370 ని ప్రజలు ఒక ముగిసిపోయిన అధ్యాయంగా పరిగణి’స్తున్నారని, గత ఏడు దశాబ్దాలుగా దానివల్ల తమకు ఒరిగిందేమిటని అని ప్రశ్నిస్తున్నారని ఒక ఆంగ్ల వారపత్రికకు ఇచ్చిన ఈ ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు. ఇంటర్వ్యూ లోని ముఖ్యాంశాలు:
ప్ర: జమ్మూ కాశ్మీర్లో ప్రస్తుత పరిస్థితిపై మీకు అందిన సమాచారం ఏమిటి? జ: అతి ముఖ్యమైన పరిణామం రాజకీయ ప్రక్రియలో ప్రజలు ఉత్సాహంగా పాల్గొనడం. డెబ్బై ఏళ్లలో మొదటిసారిగా జిల్లా అభివృద్ధి మండళ్ళకు (డిడిసిలు) ఎన్నికలు జరుగుతున్నాయి. అది యురి కానివ్వండి, బారాముల్లా లేక కుప్వారా కానివ్వండి, మారుమూల ప్రాంతాల ప్రజలు కూడా ఈ ప్రక్రియలో పాల్గొంటున్నారు. ఇది అత్యంత సానుకూల సందేశం. ఈ ఎన్నికల్లో బిజెపికి మంచిఫలితాలు లభిస్తాయి. ఈ ఎన్నికలు కుటుంబ పార్టీల అహంకారాన్ని చావుదెబ్బ తీస్తాయి. ప్రజలు ఎన్నికల్లో పాల్గొనరని భావించి ఈ పార్టీలు మొదట ఎన్నికల బహిష్కరణకు పిలుపునిచ్చాయి. కానీ జనసమూహాలను చూసి అవి తమ వైఖరిని మార్చుకోవాల్సి వచ్చింది. ఎన్నికలకు ముందే లభించిన విజయంగా దీన్ని మేము పరిగణిస్తున్నాం. ప్ర: ఈ ఎన్నికల ద్వారా బిజెపి ఏమి సాధించాలనుకుంటోంది? జ: కాశ్మీర్ లోయలో బిజెపికి కనీసం అభ్యర్ధులు కూడా దొరకరని గుప్ కార్ కూటమి పార్టీల (అధికరణం 370 రద్దుకు పూర్వస్థితిని పునరుద్దరించాలన్న గుప్ కార్ ప్రకటనపై సంతకం చేసిన ఏడు పార్టీల) నాయకులు ఎద్దేవా చేశారు. ఈనాడు బిజెపి 95 శాతానికి పైగా సీట్లలో పోటీచేస్తోంది. దీంతో వారి భ్రమలు బద్దలయ్యాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోది పుణ్యమా అని బిజెపికి కాశ్మీర్లో మంచి ఆదరణ లభిస్తోంది. ప్రజలు ఆయన ఒక పెద్ద ప్రపంచస్థాయి నాయకుడిగా చూస్తున్నారు. మతతత్వం, వేర్పాటువాదం నానాటికీ మద్దతుకోల్పోతున్నాయి. ప్ర: జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక హోదా (అధికరణం 370)ని పునరుద్దరించాలని గప్ కార్ కూటమి పార్టీలు కృషి చేస్తున్నాయి. ప్రజల్లో ఇది ఇంకాదీనిపై భావోద్వేగాలు వ్యక్తమవుతున్నాయా? జ: అధికరణం 370 రద్దుతో ఇన్నాళ్లుగా ప్రజలు ఎదుర్కొంటున్న 370 సమస్యలు పరిష్కారమై పోయాయి. కేంద్ర ప్రభుత్వ పథకాలన్నీ అక్కడ అమలవుతున్నాయి. ప్రజలు దీన్ని సానుకూల పరిణామంగా భావిస్తున్నారు. అధికరణం 370ని భూమిలో 370 కిలోమీటర్ల లోతున పాతేశాం. మరో 370 జన్మలెత్తినా దాన్ని ఎవరూ పునరుద్దరించలేరు. ప్రజలు 370 అధికరణాన్ని చరిత్రగా చూస్తున్నారు. కొన్ని పార్టీలు దీన్ని మళ్ళీ లేవనెత్తి లబ్దిపొందాలని చూస్తున్నాయి కానీ ప్రజలు మాత్రం ఏమాత్రం ఆసక్తి చూపించడంలేదు. గత 70 ఏళ్లలో ఈ ప్రత్యేక ప్రతిపత్తి వల్ల ఏమి లాభం జరిగిందని ప్రజలు అడుగుతున్నారు. ప్ర: ఈ ఎన్నికలను అధికరణం 370 రద్దుపై ప్రజాభిప్రాయ సేకరణగా పరిగణించ వచ్చా? జ: ఇవి ప్రజాస్వామ్య ప్రక్రియలో ప్రజల భాగస్వామ్య్హంపై ప్రజాభిప్రాయ సేకరణ. వారి భాగస్వామ్యం ఎంత బలంగా, ప్రభావశీలంగా ఉన్నదీ ఈ ఎన్నికలు వెల్లడిస్తాయి. ప్ర: బిజెపి మొదటినుంచి హిందూ పార్టీ అనే ముద్ర ఉంది. కాశ్మీర్ లోయలో ఈ అభిప్రాయం ఇంకా అలాగే ఉందా? జ: కాశ్మీర్ లోయ ప్రజలలో మోది పట్ల అభిమానం, ఆదరణ స్పష్టంగా కనిపిస్తాయి. ఆయనపట్ల వారికి అపార నమ్మకం ఉంది. పార్టీ ఎప్పుడూ మతపరమైన ఉద్యమాలు నడపలేదు. వివక్షకు తావులేకుండా అభివృద్ధి జరుగుతోందని, తాము సాధికారమవుతున్నామని ప్రజలు నమ్ముతున్నారు. అన్ని పథకాలు అక్కడ అమలవుతున్నాయి. క్షేత్ర స్థాయిలో ఈ మార్పు కనిపిస్తోంది. ప్రజలు వేర్పాటువాదులను ఏకాకులను చేశారు. ఇంతకుముందు జరిగిన ఎన్నికల్లో వేర్పాటువాదులు పాత్ర పోషించేవారు. కానీ ఈ ఎన్నికల్లో వాళ్ళ జాడలేదు.
|
Compose:
New Message |
More Stories
న్యూస్క్లిక్ వ్యస్థాపకుడు ప్రబీర్ పుర్కాయస్థ అరెస్ట్
ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఆప్ ఎంపీ ఇంట్లో సోదాలు
ఆసియా క్రీడల్లో పారుల్ చౌదరి, అన్నురాణిలకు స్వర్ణ పతకాలు