కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి బీజేపీలో చేరతారా!

కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి బీజేపీలో చేరతారా!

జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో అధికార టీఆర్‌ఎస్‌ చతికలబడటం, బిజెపి బలీయమైన రాజకీయ శక్తిగా ఎదగడంతో తెలంగాణలో ఇక భవిష్యత్ బీజేపీదే అని వెల్లడైనది. దానితో ఇతర పార్టీల నుండి పెద్ద ఎత్తున బిజెపిలోకి వలసలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే ప్రదేశ్ కాంగ్రెస్  ప్రచార కమిటీ చైర్ పర్సన్ విజయశాంతి వంటి పలువురు బీజేపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు. 

తాజాగా, జీహెచ్‌ఎంసీ ఫలితాలు రాగానే సీనియర్ కాంగ్రెస్ నేత కె జానారెడ్డి బీజేపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకొంటున్నట్లు తెలుస్తున్నది. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో అందరికన్నా సుదీర్ఘకాలం పలు మంత్రివర్గాలలో నాలుగు దశాబ్దాలు పైగా పనిచేసిన అనుభవం ఉన్న ఆయన మొదటసారిగా 2018 ఎన్నికలలో నాగార్జున సాగర్ నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా ఓటమి చెందారు. 
 
అంతకు ముందు శాసనసభలో కాంగ్రెస్ పార్టీ నేతగా ఉన్న ఆయన గత ఎన్నికలలో ఓటమి తర్వాత పార్టీలో ఎవ్వరు పట్టించుకొనక పోవడంతో పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. పైగా, తెలంగాణలో కాంగ్రెస్ ఇంకా బలంగా ఉన్నది పాత నల్గొండ జిల్లాలో మాత్రమే. ఆ జిల్లాలోనే ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి సోదరులు చాలాకాలంగా జానారెడ్డికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. 
 
పైగా గత ఎన్నికలలో నాగార్జునసాగర్ నుండి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా జానారెడ్డిపై  గెలుపొందిన నోముల నరసింహయ్య గత వారం అనారోగ్యంతో చనిపోవడంతో వచ్చే ఏడు మొదట్లో ఉపఎన్నిక జరుగనున్నది. దానితో బీజేపీలో చేరి, ఆ ఎన్నికలలో బిజెపి అభ్యర్థిగా పోటీ చేయడానికి జానారెడ్డి సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే ఆయన కొందరు బిజెపి నాయకులతో సమాలోచనలు జరిపినట్లు కూడా వినవస్తుంది. బిజెపికి సహితం అక్కడ బలమైన అభ్యర్థి అంటూ లేరు. 
జానారెడ్డి ఈనెల 7 న ఢిల్లీ వెళ్లి, బీజేపీ అగ్రనేతల సమక్షంలో కండువా కప్పుకోనున్నట్లు ఓ జాతీయ మీడియా పేర్కొంది. దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో తిరుగులేని శక్తిగా ఆవిర్భవించిన బీజేపీ ఇప్పుడు 2023లో జరిగే అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి సారిస్తున్నది. అసెంబ్లీ ఎన్నికల నాటికి తమ పునాదులను పటిష్ఠం చేసుకోవాలని నిర్ణయించుకుంది. 
అందులో భాగంగానే వివిధ పార్టీల్లోని సీనియర్లు, ద్వితీయ శ్రేణి నేతలను తమవైపు మళ్లించుకొని, అధికార పీఠానికి చేరువయ్యేలా బిజెపి వ్యూహకర్తలు సిద్దపడుతున్నారు. అందులో భాగంగానే జానారెడ్డిని బీజేపీ ఆహ్వానిస్తున్నట్లు భావిస్తున్నారు. పైగా,  నాగార్జునసాగర్ పై రాజకీయంగా జానారెడ్డికి ఎనలేని పట్టుంది. తద్వారా నాగార్జున సాగర్‌లో పాగా వేయాలని బీజేపీ నిర్ణయించుకుంది.