`స్థానిక’ ఎన్నికలపై అసెంబ్లీ తీర్మానం రాజ్యాంగ విరుద్ధం 

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర అసెంబ్లీ తీర్మాణం చేయడం రాజ్యాంగ విరుద్ధమని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ స్పష్టం చేశారు. ఈ మేరకు గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌కు ఆయన శనివారం లేఖ రాశారు. 
 
చివరి రోజు అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఫిబ్రవరిలో నిర్వహించలేమని, కరోనా సెకండ్‌ వేవ్‌ పొంచి ఉందని, ప్రభుత్వానికి ప్రజల ప్రాణ రక్షణే ముఖ్యమని పేర్కొంటూ అసెంబ్లీ తీర్మానించింది. దీనిపై స్పందించిన నిమ్మగడ్డ నేడు గవర్నర్‌కు లేఖ రాశారు.
 
రాజ్యాంగంలోని 243కె అధికరణ కింద ఎన్నికల కమిషన్‌కు స్వయం ప్రతిపత్తి ఉందని, ఐదేళ్లకొక సారి ఎన్నికలు జరపడం కమిషన్‌ విధి అని లేఖలో పేర్కొన్నారు. కేంద్ర ఎన్నికల కమిషన్‌కు, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు సమాన అధికారాలు ఉంటాయని తెలిపారు.
ప్రభుత్వ సమ్మతితో ఎన్నికలు జరపాలన్న నిర్ణయం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని చెప్పారు. అలాంటి ఆర్డినెన్స్‌ వస్తే తిరస్కరించాలని, అవసరమైతే సుప్రీంకోర్టు న్యాయనిపుణులను సంప్రదించాలని నిమ్మగడ్డ విజ్ఞప్తి చేశారు.