కరొనపై ఒక్క రూపాయి ఖర్చు పెట్టని జగన్… కేంద్ర నిధులతో సరి!

వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం గత పది నెలలుగా కరోనాపై జరుపుతున్న పోరులో సొంతంగా ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా కేంద్ర నిధులతోనే కాలక్షేపం చేస్తున్నది. పైగా కేంద్ర నిధులను తన రోజువారీ అవసరాల కోసం కూడా దారిమళ్లిస్తున్నది. 

జాతీయ ఆరోగ్య మిషన్‌ (ఎన్‌హెచ్‌ఎం) కింద కేంద్రం ఇచ్చిన రూ.600 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఇతర అవసరాలకు వాడుకుంది. విపత్తు పరిస్థితులను ఎదుర్కోవడానికి కేంద్రం ఇస్తున్న నిధులను సహితం జగన్ ప్రభుత్వం యథేచ్ఛగా ఇతర అవసరాలకు వాడుకొంటున్నది. అత్యవసర సమయంలో ఇస్తానని హామీపడిన రూ.180 కోట్లనూ సహితం జగన్ ప్రభుత్వం విడుదల చేయనే లేదు. 

పైగా, కేంద్రం ఇచ్చిన కొవిడ్‌ నిధులనూ పథకాలకు మళ్లించింది. కొవిడ్‌ పరికరాలను సమకూర్చుకొన్న పీహెడ్‌సీలు, కలెక్టర్లకు, ఇన్నాళ్లలో రూపాయి చెల్లించకుండా నెట్టుకొస్తోంది. వివిధ ఆరోగ్య పథకాలు అమలు కోసం ఎన్‌హెచ్‌ఎంకు కేంద్రం విడుదల చేసే మొత్తంలో 40 శాతం నిధులను రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చవలసి ఉంటుంది. 

అయితే  కేంద్రం నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ కింద రూ.600 కోట్లు విడుదల చేయగా, దీనికి మ్యాచింగ్‌ నిధులు కింద రాష్ట్రం 400 కోట్లు ఇవ్వాలి. కానీ ఇప్పటి వరకు ఒక రూపాయి కూడా విడుదల చేయనే లేదు. ఎన్‌హెచ్‌ఎంకు రూ.250 కోట్లు, ఎస్‌డీఆర్‌ఎ్‌ఫకు రూ.300 కోట్ల వరకూ అత్యవసర కొవిడ్‌ నిధుల కింద కేంద్రం కేటాయించింది. 

ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండు కేంద్ర విభాగాల నిధులనే కొవిడ్‌ నివారణకు ఉపయోగిస్తోంది. దీంతో పాటు కొవిడ్‌ సమయంలో అత్యవసర మందుల కొనుగోలు, వైద్య పరికరాలు, టెస్టింగ్‌, ట్రేసింగ్‌, ట్రీటింగ్‌ కోసం ఆరోగ్యశాఖ వందల కోట్లు ఖర్చు చేసింది. దీనికి సంబంధించీ రాష్ట్ర ప్రభుత్వం తన వంతుగా ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు. 

పైగా మరో రూ.250 కోట్లు అత్యవసర కొవిడ్‌ నిధుల నుంచి విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. కేంద్రం దీనిని సున్నితంగా తిరస్కరించింది. ఈ నేపథ్యంలో సెకండ్‌ వేవ్‌ మొదలయితే కరోనాను నియంత్రించడం తమ వల్ల కాదని ఆరోగ్యశాఖ అధికారులు చేతులెత్తేస్తున్నారు. 

కేంద్రం నుండి ఇంత భారీగా నిధులు వస్తున్నా వాటిని కోవిద్ కు సంబంధించిన బిల్లులు చెల్లించడానికి మాత్రం ఉపయోగించడం లేదు. కొవిడ్‌కు బిల్లులు వెంట వెంటనే క్లియర్‌ చేస్తారని భావించి చాలామంది కోట్ల రూపాయిలు మందులు, పరికరాలు ఏపీఎ్‌సఎంఐడీసీకి సరఫరా చేశారు. 

కొవిడ్‌ సమయంలో ఈ ఒక్క విభాగమే సుమారు రూ.600 కోట్లు విలువైన మందులు, పరికరాలు కొనుగోలు చేసింది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం 200 కోట్లు మాత్రమే చెల్లించింది. ఇంకా 400 కోట్ల వరకూ బిల్లులు పెండింగ్‌లో పెట్టారు.

కొవిడ్‌ తీవ్రంగా విజృంభించిన సమయంలో ఆరోగ్యశాఖ రోజుకి 6.5 కోట్లు ఖర్చు చేసేది. ఈ లెక్కన నెలకి సుమారు 195 కోట్ల వరకూ ఖర్చు చేసేది. కరోనా రెండో విడత మొదలైతే నెలకు రూ.300 కోట్ల వరకూ ఖర్చు పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. తొలి విడుతలోనే రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి విడుదల చేయలేదు.

ప్రస్తుత పరిస్థితులలో కేంద్రం నుండి మరింకా నిధులు లభించే అవకాశాలు కనిపించడం లేదు.  మరోవైపు ఎన్‌హెచ్‌ఎం నిధులు వాడుకుందామంటే మొత్తం నిధులను ప్రభుత్వం ఇతర పథకాలకు మళ్లించుకుంది. 

తాము కొవిడ్‌ నివారణకు వందల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు ప్రచారం చేసుకునేందుకు.. జీవోల్లో మాత్రం భారీగా  నిధులు చూపిస్తోంది. ఈ జీవోలు పట్టుకుని ఆన్‌లైన్‌లో బిల్లులు అప్‌లోడ్‌ చేస్తే మాత్రం నిధులు నిల్‌ అని చూపిస్తోంది. గత నాలుగు నెలలుగా ఆరోగ్యశాఖ కొవిడ్‌ కోసం ఖర్చుచేసిన వాటన్నింటికీ ప్రభుత్వం జీవోలు విడుదల చేసింది. కానీ బిల్లులు మాత్రం క్లియర్‌ కావడం లేదు. 

కొవిడ్‌ సమయంలో ప్రభుత్వం ఇంటింటి సర్వే చేపట్టింది. ఇందుకోసం ఎఎన్‌ఎంలకు సుమారు 12 వేల ట్యాబ్‌లను అందించింది. ప్రభుత్వం ఇచ్చిన ట్యాబ్‌లు పాడైపోయే పరిస్థితికి వచ్చాయి. కానీ వాటిని కొన్న బిల్లులు మాత్రం క్లియర్‌ కావడం లేదు. 

కొవిడ్‌ సమయంలో పీహెచ్‌సీలకు అవసరమైన మందులు, పరికరాలు కొనుగోలు చేసుకోవాలని ఆదేశించింది. ఇందుకోసం రూ.250 కోట్ల వరకూ పీహెచ్‌సీ వైద్యులు ఖర్చు చేశారు. ఇందులో ఒక్క రూపాయి బిల్లు కూడా రావడం లేదు.