రాజధాని అమరావతిలో భూ కుంభకోణనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం హైకోర్టులో కీలక వాదనలు వినిపించింది. మాజీ సీఎం చంద్రబాబునాయుడు, మాజీ మంత్రి లోకేష్ సన్నిహితులు అమరావతి చుట్టుపక్కల కొనుగోలు చేసిన భూముల వివరాలను డాక్యుమెంట్ నెంబర్లతో సహా హైకోర్టు ముందు ఉంచింది. ఎన్నారైలతో కొందరు సాగించిన వాట్సాప్ సంభాషణల వివరాలను కూడా కోర్టుకు సమర్పించింది.
అమరావతి భూ కుంభకోణం వెనుక చాలా పెద్ద తలకాయలున్నాయని, సీఐడీ దర్యాప్తును కొనసాగనివ్వాలని అభ్యర్థిస్తప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) శ్రీరామ్ వాదనలు వినిపించారు. సీఐడీ అదనపు ఎస్పీ గోపాలకృష్ణ కౌంటర్ దాఖలు చేశారు. తదుపరి వాదనల నిమిత్తం విచారణను బుధవారానికి వాయిదా వేస్తూ న్యాయమూర్తి జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ ఉత్తర్వులు జారీ చేశారు.
శ్రీరామ్ వాదనల ప్రకారం లలిత సూపర్ స్పెషాలిటీస్ ఆస్పత్రి యాజమాన్యం వెలగపూడి, తాడికొండ, తక్కెళ్లపాడు గ్రామాల్లో 2014 సెప్టెంబర్ 26 నుంచి నవంబర్ 27 వరకు 26.62 ఎకరాలను కొనుగోలు చేసింది. తమ భూములున్న చోట కోర్ క్యాపిటల్ వస్తుందని, ల్యాండ్ పూలింగ్ పథకాన్ని ప్రకటిస్తారని తెలియక భూములు విక్రయించినట్లు అమ్మకందార్లు వాంగ్మూలం ఇచ్చారు.
నార్త్‌ఫేస్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్లు తొట్టెంపూడి వెంకటేశ్వరరావు, చేకూరి తేజస్వి తదితరులు చినకాకాని, కంచికచర్ల, బలుసుపాడు, లింగాపురం, నవులూరు, బేతంపూడి, మందడం, ధరణికోట, ఉంగుటూరు తదితర గ్రామాల్లో 2014 జూన్ 6 నుంచి డిసెంబర్ 24 వరకు 17.80 ఎకరాలను కొనుగోలు చేశారు. చేకూరి తేజస్వి ఇంట్లో భూ లావాదేవీల డాక్యుమెంట్లు పెద్ద సంఖ్యలో లభించాయి. మనీ లాండరింగ్ దిశగా దర్యాప్తు జరపాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ను కోరారు.
చంద్రబాబు సతీమణి భువనేశ్వరికి చెందిన హెరిటేజ్ ఫిన్‌లీజ్‌లో పనిచేసిన కిలారు రాజేశ్‌కు లోకేష్‌తో అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయి. రాజేశ్ భార్య శ్రీహాస, మరొకరు కంతేరులో 2.64 ఎకరాల భూమిని 2014 ఆగస్టు, సెప్టెంబర్‌లో కొన్నారు.
తాళ్లం మణికొండ అనంత సాయి విశ్వనాథ్ భాగస్వామిగా ఉన్న గాయత్రీ రియల్టర్స్ రాజధాని గ్రామాల్లో 23.60 ఎకరాలను 2014 మార్చి నుంచి నవంబర్ వరకు కొనుగోలు చేసింది. వర్టెక్స్ హోమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం నంబూరు, కంతేరు, కాజ గ్రామాల్లో 2014 జూన్ నుంచి నవంబర్ వరకు 12.23 ఎకరాలు కొనుగోలు చేసింది. గుడ్ లైఫ్ ఎస్టేట్స్ యాజమాన్యం కూడా నవులూరు, బేతపూడి, ఆత్మకూరు గ్రామాల్లో 10.23 ఎకరాలను కొనుగోలు చేసింది.
More Stories
హెచ్‌సీఏలో రూ. 20 కోట్ల మోసం.. అజారుద్దీన్‌కు ఈడీ సమన్లు
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మీడియాపై 50 శాతం పెరిగిన దాడులు!
సమంతకు మంత్రి సురేఖ క్షమాపణలు