జాతీయ గీతం మార్పు కోరిన స్వామి 

జాతీయ గీతంలో అనవసరపు పదాలు ఉన్నాయని దానిని మార్చాలని ప్రధాని మోదీని బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి కోరారు.  ఆ గీతం ఎవరిని ప్రశంసిస్తూ రాశారో అనే అనుమానాలు ఉన్నాయని అయన పేర్కొన్నారు. ప్రస్తుత గీతం స్థానంలో సుభాష్‌ చంద్రబోస్‌ నేతృత్వంలోని ఇండియన్‌ నేషనల్‌ ఆర్మీ 1943 అక్టోబరు 21న ఇంఫాల్‌ను స్వాధీనం చేసుకోగానే ఆలపించిన  గీతాన్ని అమలు చేయాలంటూ మంగళవారం ప్రధానికి లేఖ రాశారు. 

‘జనగనమణ’లో పేర్కొన్న ‘సింధు’ ప్రాంతం ఇప్పుడు పాక్‌ భూభాగంలో ఉందని, దానిని తొలగించి ‘ఈశాన్యం’ అనే పదాన్ని జోడించాలంటూ 2019లో కాంగ్రెస్‌ ఎంపీ రిపున్‌ బోరా రాజ్యసభలో ప్రైవేటు బిల్లు ప్రవేశ పెట్టారని తెలిపారు.

భవిష్యత్తులో ‘జనగనమణ’లోని అనవసరపు పదాలను తొలగించి, అవసరమైన పదాలతో జాతీయ గీతాన్ని పునరుద్ధరిస్తామని 1949 నవంబరు 26న నాటి రాష్ట్రపతి డాక్టర్‌ రాజేంద్ర ప్రసాద్‌ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. కొత్త జాతీయ గీతాన్ని వచ్చే ఏడాది జనవరి 26వ తేదీ లోపు రూపొందించాలని ప్రధానికి రాసిన లేఖలో స్వామి  సూచించారు. 

‘జనగణమణ’ను 1911 డిసెంబరు 27న కలకత్తాలో ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ సమావేశంలో తొలిసారి ఆలపించారని సుబ్రమణ్యస్వామి పేర్కొన్నారు. అందులోని ‘భారత భాగ్య విధాత’ అనే పదానికి బదులు ఇండియన్‌ నేషనల్‌ ఆర్మీ 1943లో ‘షుభ్‌ సుఖ్‌ చైన్‌’ అనే పదాన్ని జోడించి ఆలపించింది. ఈ కొత్త జాతీయ గీతాన్ని బోస్‌ రచించగా కెప్టెన్‌ రామ్‌సింగ్‌ స్వరపరిచారని తెలిపారు.