వచ్చే ఏడాది ప్రవాస భారతీయులకు పోస్టల్ బ్యాలట్!

వచ్చే ఏడాది ప్రవాస భారతీయులకు పోస్టల్ బ్యాలట్!

ప్రవాస భారతీయులకు వచ్చే ఏడాది జరిగే వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో పోస్టల్ బ్యాలట్ ద్వారా ఓటు హక్కు కల్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు రక్షణ రంగానికి చెందిన ఉద్యోగులకు మాత్రమే అందుబాటులో ఉన్న ఎలెక్ట్రానికల్లీ ట్రాన్స్‌మిటెడ్ పోస్టల్ బ్యాలట్ సిస్టమ్ (ఇటిపిబిఎస్)ను విదేశాలలో ఉన్న అర్హులైన విదేశాలలోని భారతీయ వోటర్లకు కూడా వర్తింపచేయాలని ఎన్నికల సంఘం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించింది. 

సైనిక రంగానికి చెందిన ఓటర్లకు ఇటిపిబిఎస్‌ను విజయవంతంగా అమలు చేసిన దరిమిలా ఈ విధానాన్ని విదేశీ ఓటర్లకు కూడా అమలు చేయగలమన్న ధీమా ఏర్పడిందని పేర్కొంటూ ఎన్నికల సంఘం నవంబర్ 27న కేంద్ర న్యాయ శాఖలోని లెజిస్లేటివ్ కార్యదర్శికి లేఖ రాసింది.

అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరికి వచ్చే ఏడాదిలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలలో ఈ సౌకర్యాన్ని అమలు చేయడానికి సాంకేతికంగా, పాలనాపరంగా సిద్ధంగా ఉన్నామని కూడా ఎన్నికల సంఘం తన లేఖలో తెలిపింది. వచ్చే ఏడాది 

విదేశాలలో ఉద్యోగాల నిమిత్తం, చదువు నిమిత్తం, మరే ఇతర కార్యకలాపాల నిమిత్తం నివసిస్తున్న భారతీయులు తమ ప్రాంతంలో ఎన్నికలు జరిగినపుడు అక్కడకు వెళ్లి ఓటు వేయడం చాలా వ్యయప్రయాసాలతో కూడుకున్నదిగా పరిణమించిందని, అందుకే తమకు కూడా పోస్టల్ బ్యాలట్ సౌకర్యాన్ని కల్పించాలని చాలాకాలంగా కోరుతున్నారు. 

1951 నాటి ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని 62వ సెక్షన్ ప్రకారం ఓటరు జాబితాలో ఉన్న ప్రతి పౌరుడికి అనర్హత వేటు పడితే తప్ప తన ఓటు హక్కును వినియోగించుకునే హక్కు ఉంటుంది. ప్రస్తుత నిబంధనల ప్రకారం విదేశాలలో నివసిస్తున్న భారతీయ ఓటర్లు తమ ఓటు ఉన్న నియోజకవర్గానికి వచ్చి ఓటు వేసుకునే అవకాశం ఉంది.

అయితే ఓటు వేయడం కోసం అంత ఖర్చు పెటి భారతదేశానికి రావాలన్న కారణంపై కేవలం 10,000 నుంచి 12,000 మంది విదేశీ  ఓటర్లు మాత్రమే తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారని ఎన్నికల సంఘం వద్ద ఉన్న అనధికార వివరాలు తెలుపుతున్నాయి. 

ఇటిపిబిఎస్ కింద రక్షణ రంగ ఉద్యోగులకు పోస్టల్ బ్యాలట్‌ను ఎలెక్ట్రానిక్ పద్ధతిలో ఎన్నికల సంఘం పంపుతుంది. దీన్ని రక్షణ రంగ ఓటరు డౌన్‌లోడ్ చేసుకుని తన నియోజకవర్గానికి చెందిన రిటర్నింగ్ అధికారికి ఒక ప్రత్యేక ఎన్‌వలప్‌లో పంపాల్సి ఉంటుంది.