పాక్ ఉగ్రవాదులు, ఐఎస్ఐ లకు చైనా డ్రోన్లు 

భారత్ లోకి చొర‌బాట్లు క‌ష్ట‌మ‌వ‌డంతో పాక్ ఉగ్ర‌వాద సంస్థ‌లు, అక్క‌డి ఇంట‌ర్ స‌ర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) కొత్త ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టాయి. పంజాబ్‌, జ‌మ్ము క‌శ్మీర్‌ల‌‌కు డ్రోన్ల ద్వారా ఆయుధాల‌ను చేర‌వేస్తున్న‌ట్లు కౌంట‌ర్ టెర్ర‌రిజం అధికారులు వెల్ల‌డించారు. ఆయుధాలను చేర‌వేయ‌డానికి ఉగ్ర‌వాద సంస్థ‌లు, ఐఎస్ఐ చాలా రోజులుగా డ్రోన్ల‌ను ఉప‌యోగిస్తున్నా తాజాగా మ‌రింత ఆధునిక‌మైన చైనా డ్రోన్ల‌ను వాడుతున్న‌ట్లు ఆ అధికారులు చెప్పారు. 

గ‌తంలో చిన్న మొత్తంలో మాత్ర‌మే ఆయుధాల‌ను చేర‌వేసే వార‌ని, ఈ ఆధునిక డ్రోన్ల ద్వారా భారీ ఎత్తున ఆయుధాలు వ‌స్తున్నాయ‌ని తెలిపారు. జ‌మ్ముక‌శ్మీర్‌లో నియంత్ర‌ణ రేఖ వెంబ‌డి ఎత్త‌యిన ప‌ర్వ‌తాల వ‌ల్ల జిహాదీల చొర‌బాట్లు అంత తేలిగ్గా జ‌ర‌గ‌డం లేదు. దీంతో అత్యాధునిక డ్రోన్లు ఉగ్ర‌వాద సంస్థ‌లు, ఐఎస్ఐకి బాగా ఉప‌యోగ‌ప‌డుతున్న‌ట్లు ఒక అధికారి వెల్ల‌డించారు. 

జ‌మ్ముక‌శ్మీర్‌లో ఉగ్ర‌వాదులకు చేర‌వేయ‌డానికి భారీ ఎత్తున ఆయుధాల‌ను పంజాబ్‌కు చేర‌వేస్తున్న‌ట్లు ప‌లు ఇంటెలిజెన్స్ నివేదిక‌లు స్ప‌ష్టం చేస్తున్నాయి. అంతేకాకుండా తాజాగా పంజాబ్ రైతుల ఆందోళ‌న‌ను త‌మ‌కు అనుకూలంగా మార్చుకోవ‌డానికి జ‌మ్ముక‌శ్మీర్‌లోని ఖ‌లిస్తానీ గ్రూపుల‌ను ఎగ‌దోస్తున్న‌ట్లు కూడా స‌మాచారం అందుతోంది. ఈ స‌మాచారాన్ని ఇంటెలిజెన్స్ వ‌ర్గాలు ఎప్ప‌టిక‌ప్పుడు కేంద్ర ప్ర‌భుత్వానికి చేర‌వేస్తున్నారు.  

ఒక్క పంజాబ్‌లోనే ఇప్ప‌టి వ‌ర‌కు 4 చైనీస్ డ్రోన్ల‌ను రిక‌వ‌రీ చేయ‌డం గ‌మ‌నార్హం. ఆయుధాల‌నే కాకుండా  డ్రోన్ల ద్వారా స‌రిహ‌ద్దుల్లో బాంబులు వేయ‌డానికి కూడా ఉగ్ర‌వాద సంస్థ‌లు ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తుండ‌టం మ‌రింత ఆందోళ‌న క‌లిగిస్తున్నది.  ఈ అత్యాధునిక డ్రోన్ల‌ను ఉగ్ర‌వాద సంస్థ‌ల‌కు చేర‌వేసి, మ‌రింత పెద్ద దాడుల‌కు వారిని ఉసిగొల్పే ప‌ని పాకిస్థాన్‌కు చెందిన ఐఎస్ఐ చేస్తున్న‌ట్లు ఇంటెలిజెన్స్ వ‌ర్గాలు చెబుతున్నాయి.

ఇప్ప‌టికే ల‌ష్క‌రే తోయిబా, జైషే మ‌హ్మ‌ద్ క‌మాండ‌ర్ల‌తో ఈ ఏడాది ఏప్రిల్‌లో ఐఎస్ఐ స‌మావేశ‌మైంద‌ని, అక్టోబ‌ర్‌లోనూ పాక్ ఆక్ర‌మిత క‌శ్మీర్‌లోని కోట్లి జిల్లాలో మ‌రోసారి స‌మావేశం నిర్వ‌హించినట్లు తెలిపాయి. వ‌చ్చే రెండు నెల‌లూ స‌రిహ‌ద్దులో పొగ‌మంచు విప‌రీతంగా ఉండే అవ‌కాశం ఉండ‌టంతో ఈ డ్రోన్ల ద్వారా ఆయుధాల చేర‌వేత మ‌రింత ఎక్కువ కానున్న‌ట్లు అంచ‌నా వేస్తున్నారు. 

ఈ డ్రోన్ల‌కు చెక్ పెట్ట‌డానికి యాంటీ డ్రోన్ వ్య‌వ‌స్థ‌ల‌ను రంగంలోకి దించే ప‌నిలో భార‌త ప్ర‌భుత్వం ఉంది. ఇప్ప‌టికే ఈ డ్రోన్ల‌ను గుర్తించి, నాశ‌నం చేసేందుకు పంజాబ్ పోలీసులు త‌క్కువ స్థాయి రాడార్ల‌ను మోహ‌రించాల్సిందిగా కేంద్రంతోపాటు ఇండియ‌న్ ఎయిర్‌ఫోర్స్‌ను అభ్య‌ర్థించారు.