అసెంబ్లీలో బూతులు తిట్టుకుంటూ కాలం గడుపుతున్నారే తప్ప రైతులను ఆదుకోవటంలో జగన్ ప్రభుత్వం మీనమేషాలు లెక్కపెడుతోందని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ ధ్వజమెత్తారు. బుధవారం ఆయన కృష్ణాజిల్లా ఉయ్యూరు, పామర్రు, చల్లపల్లి, అవనిగడ్డ మండలాలతో పాటు గుంటూరు జిల్లా రేపల్లె, భట్టిప్రోలు, తెనాలి మండలాల్లో పర్యటించి నివర్ తుఫానుతో దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. బాధిత రైతులను పరామర్శించారు.
ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ రైతులకు నష్టపరిహారం అందించటంలో వైసీసీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ధ్వజమెత్తారు . నష్టపోయిన రైతులకు క్రిస్మస్ లోపు ఎకరాకు రూ.30 వేలు చొప్పున ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి డెడ్‌లైన్ విధించారు. తక్షణ సాయం కింద 24గంటల్లో ప్రతి రైతుకు రూ.10వేలు ఆర్థిక సహాయం అందించాలని లేకుంటే వారి తరఫున రోడ్డెక్కాల్సి ఉంటుందని హెచ్చరించారు.
తెలంగాణలో వరదలు వస్తే టీఆర్‌ఎస్ ప్రభుత్వం తక్షణ సాయంగా రూ.6,500 కోట్లు అందించిందని గుర్తు చేశారు. మన రాష్ట్రంలో నేటికీ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదంటే ఈ ప్రభుత్వానికి రైతులపై ఎంత ప్రేమ ఉందో అర్థమవుతోందని విమర్శించారు. కొంతమంది మంత్రులు విచక్షణారహితంగా మాట్లాడుతూ రైతులను హేళన చేసేవిధంగా ప్రవర్తిస్తూ, వారికి ఎలాంటి నష్టం వాటిల్లలేదన్నట్లుగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు.
రాష్ట్రంలో 65శాతం మంది కౌలు రైతులే వరి పంట వేశారని చెబుతూ వారిని తప్పనిసరిగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. భూ యజమానులకు ఇచ్చేదానితో సమానంగా కౌలురైతులకూ ప్యాకేజీ అమలు చేయాలని, లేకుంటే ఉద్యమాన్ని భుజాన వేసుకుంటానని పవన్ కళ్యాణ్హెచ్చరించారు. ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు రూ.5లక్షలు ఇవ్వాలని స్పష్టం చేశారు.
గ్రేడింగ్, శాతం వంటి కేటగిరీలు లేకుండా నష్టం అంచనాలను నమోదు చేయాలని చెబుతూ తడిసిన ధాన్యాన్ని మొత్తం ప్రభుత్వమే కొనుగోలు చేయాలని పవన్ డిమాండ్ చేశారు. ‘‘ప్రజలకు మేలు చేస్తారని 151 మందిని గెలిపించారు. వారిప్పుడు అసెంబ్లీకి, ఇంటికే పరిమితమయ్యారు. ఉపయోగం లేనివారు అంతమంది ఉన్నా వారంతా కౌరవ సంతతితో సమానమే” అంటూ ఎద్దేవా చేశారు.
ఒక్క రాజధానికే దిక్కులేదు గానీ మూడు రాజధానుల డాబెందుకో అర్థం కావటంలేదని ధ్వజమెత్తారు. మూడు రాజధానులు కట్టేటంత సామర్థ్యం ఉంటే రైతులకు పరిహారం ఇవ్వటానికి ఇబ్బందేంటి? అని పవన్ ప్రశ్నించారు.
కాగా, పామర్రు నియోజకవర్గంలో పెద్దపూడి అడ్డరోడ్డు వద్ద పవన్‌కల్యాణ్‌ను పెనమలూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కొలుసు పార్థసారథి తండ్రి కేపీ రెడ్డయ్య కలిశారు. పంటల నష్టం అంచనాలన్నీ మోసపూరితమేనని, రైతులకు సంపూర్ణ న్యాయం జరిగేలా పోరాటం చేయాలని పవన్‌ను ఆయన కోరారు.
నివార్ తుఫాన్ ప్రభావం రైతులను నట్టేట ముంచిందని చెబుతూ రైతుల కన్నీళ్లు దేశానికి మంచిది కాదని హెచ్చరించారు. కర్షకుల కష్టాలు, కన్నీళ్లను కేంద్రం దృష్టికి తీసుకెళ్తా అని చెబుతూ ప్రకృతి వైపరీత్యాల పై రాజకీయం చేయబోనని స్పష్టం చేశారు.
More Stories
హర్యానాలో వరుసగా మూడోసారి బీజేపీ అద్భుత విజయం
జమ్ముకశ్మీర్ తదుపరి సీఎంగా ఒమర్ అబ్దుల్లా
పోలవరంకు కేంద్రం రూ.2,800 కోట్లు విడుదల