మద్దతు ధరపై రైతులకు భరోసా కల్పించాల్సిందే

కేంద్రం తీసుకొచ్చిన చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీలో జరుగుతున్న రైతుల నిరసనలపై స్వదేశీ జాగరణ్ మంచ్ స్పందించింది. 
‘‘కేంద్రం తీసుకొచ్చిన చట్టాలను సమర్థిస్తున్నాం. అయితే కనీస మద్దతు ధర విషయంలో మాత్రం రైతులకు కేంద్రం భరోసా ఇవ్వాల్సిందే. చట్టాన్ని మార్చే అధికారం ప్రభుత్వానికి ఉంది. కొత్త చట్టాన్ని కూడా తీసుకురావచ్చు.’’ అని స్వదేశీ జాగరణ్ మంచ్ నేత అశ్వనీ మహజన్ పేర్కొన్నారు. 
 
మార్కెట్ బయట అమ్ముకోవడం సరైనదేనని, అయితే ప్రైవేట్ రంగంలోని పెద్ద కంపెనీలు కూడా అలా చేయడం ద్వారా రైతులను కష్టాల్లోకి నెట్టేసిన వారవుతారని అశ్వనీ మహజన్ హెచ్చరించారు. 
పార్లమెంట్ ఈ చట్టాలను ఆమోదించిన సమయంలోనే రైతులతో ఒప్పందం చేసుకొనే ప్రైవేట్ వ్యాపారులు మద్దతు ధరకన్నా తక్కువ చెల్లించకుండా చట్టంలో ఎటువంటి రక్షణ లేదని స్వదేశీ జాగరణ మంచ్ అసంతృఫ్తీ వ్యక్తం చేసింది. తగు రక్షణలు కల్పిస్తూ చట్టంలో మార్పులు తీసుకు రావాలని కోరింది. 
 
పైగా, ఈ ఒప్పందాల విషయంలో, హామీ ఇచ్చిన ధర చెల్లింపు విషయంలో రైతులు, ప్రైవేట్ కంపెనీల మధ్య వివాదాలు తలెత్తితే పరిష్కరించే బాధ్యత ఆర్డీఓ స్థాయి అధికారికి అప్పజెప్పడం పట్ల కూడా జాగరణ మంచ్ అభ్యంతరం వ్యక్తం చేసింది. వివాదాల పరిష్కారానికి సమర్ధవంతమైన యంత్రాంగం ఏర్పాటు చేయాలని సూచించింది. 
 
పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు వ్యవసాయ మార్కెటింగ్ లోకి ప్రవేశిస్తే, వారిని చద్దబద్దంగా వ్యవహరించుకొనేటట్లు చేయడం ఇప్పటికే ఎన్నో అధికార విధులతో తీరిక లేకుండా ఉండే ఆర్డీఓ స్థాయి అధికారులకు సాధ్యం కాదని కూడా స్పష్టం చేసింది. అదే విధంగా ఈ చట్టంలో `రైతులు’ అన్న పదానికి ఇచ్చిన నిర్వచనంలో కార్పొరేట్ లను తొలగించాలని కూడా డిమాండ్ చేసింది. 
 
ఇలా ఉండగా, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో ఆయన నివాసంలో కేంద్ర మంత్రులు పీయూష్‌ గోయల్‌, వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్‌ బుధవారం సమావేశయ్యారు. ఏడు రోజులుగా ఆందోళనలు కొనసాగిస్తున్న రైతులతో మంగళవారం ప్రభుత్వం జరిపిన చర్చలు అసంపూర్తిగా ముగియడం, తిరిగి గురువారం చర్చలు జరుపనున్న దృష్ట్యా ఈ భేటీ జరిగింది. 
 
ఈ నేపథ్యంలో రైతు సంఘాల డిమాండ్లపై అమిత్‌షాతో చర్చించనున్నట్లు సమాచారం. అలాగే రేపు జరిగే సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించిన్నట్లు తెలుస్తున్నది. మరో వైపు రైతులు ఢిల్లీ సరిహద్దులో తమ ఆందోళనను కొనసాగిస్తున్నారు.
 
 ఢిల్లీ- ఖాపీపూర్‌ సరిహద్దు వద్ద ఆందోళన చేస్తున్న రైతలు పశువులను రోడ్లపైకి తీసుకువచ్చి నిరసన తెలిపారు. అలాగే సింఘు, తిక్రీల్లోనూ నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. కేంద్రం బిల్లులను వెనక్కి తీసుకునే వరకు ఆందోళన విరమించేది లేదని స్పష్టం చేశారు.