మ‌తాంత‌ర వివాహాల‌ను ప్రోత్స‌హించే పధకం రద్దు 

44 యేళ్ళనాటి కులాంత‌ర‌, మ‌తాంత‌ర వివాహాల‌ను ప్రోత్స‌హించే పధకాన్ని రద్దు చేయాలనీ ఉత్తర ప్రదేశ్ లో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం నిర్ణయించింది.  ల‌వ్ జిహాద్ పేరుతో జ‌రుగుతున్న మ‌త‌మార్పుడుల‌ను అడ్డుకునేందుకు యూపీ స‌ర్కార్ కొత్త చ‌ట్టాన్ని తెస్తున్న విష‌యం తెలిసిందే.
 
కానీ భిన్న విశ్వాసాల ప్ర‌జ‌ల మ‌ధ్య జ‌రిగే  వివాహ ప్ర‌క్రియ‌ల‌ను ప్రోత్స‌హించేందుకు 1976లో ప్ర‌వేశపెట్టిన పధకాన్ని ఇప్పుడు ర‌ద్దు చేయాల‌ని భావిస్తున్నారు.  ఈ పధకాన్ని యూపీలోని నేష‌న‌ల్ ఇంటిగ్రేష‌న్ డిపార్ట్‌మెంట్ చూస్తున్న‌ది. యూపీ నుంచి విడువ‌డిన ఉత్త‌రాఖండ్ రాష్ట్రం కూడా ఈ పధకాన్ని ర‌ద్దు చేయాల‌ని భావిస్తున్న‌ది. 
 
ఈ పధకం కింద‌.. మ‌తాంత‌ర వివాహం చేసుకున్న వారు పెళ్లి జ‌రిగిన రెండేళ్ల‌లోపు జిల్లా మెజిస్ట్రేట్‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. ఆ ద‌ర‌ఖాస్తు ఆమోదం పొందిన దంప‌తుల‌కు రూ 50వేల న‌గ‌దు ఇస్తారు.  గ‌త ఏడాది ఈ పధకం కింద 11 జంట‌లు ల‌బ్ధిపొందాయి. కానీ ఈ ఏడాది ఒక్క‌రికి కూడా పారితోషికం విడుదల చేయ‌లేదు. 
 
ఈ పధకం  కోసం నాలుగు ద‌ర‌ఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. మ‌త‌మార్పుడుల‌కు పాల్ప‌డేవారికి ప‌దేళ్లు క‌ఠిన శిక్ష అమ‌లు చేయ‌నున్న‌ట్లు ఇటీవ‌ల యోగి స‌ర్కార్ ఓ ఆర్డినెన్స్ జారీ చేసిన విష‌యం తెలిసిందే. ఆ ఆర్డినెన్స్‌కు గ‌వ‌ర్న‌ర్ ఆమోదం కూడా లభించింది.