కరోనా సమయంలో భారీగా పెరిగిన విదేశీ పెట్టుబడులు 

కరోనా మహమ్మారి కాలంలో కూడా ఈ ఏడాది భారత్ కు విదేశీ పెట్టుబడులు పెరిగాయి. ఆర్థిక సంవత్సరం 2020-21 ఆరునెలల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్ డీఐలు)15శాతం పెరిగాయి. ఏప్రిల్-సెప్టెంబర్ కాలంలో గత ఏడాదితో పోలిస్తే ఈ పెట్టుబడులు పెద్ద ఎత్తున పెరిగాయని ప్రభుత్వ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. కేవలం ఆరు నెలల కాలంలో దేశంలోకి 30 బిలియన్ డాలర్లు (2.22 లక్షల కోట్లు) విదేశీ పెట్టుబడులు వచ్చాయి. 
 
2019-20 ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలంలో 26 బిలియన్ డాలర్లుగా నమోదయింది. ఇందులో ఎక్కువగా పెట్టుబడులు మారిషస్ (29 శాతం), సింగపూర్ (21 శాతం) నుంచి   వచ్చాయి. ఆ తర్వాత సంస్థానంలో అమెరికా, నెదర్లాండ్స్, జపాన్ 7 శాతం అంతకంటే ఎక్కువగా ఉన్నాయి. 
 
ఎఫ్ డీఐలు భారత్‌కు పెరగడంతో మారిషస్ నాలుగో స్థానానికి చేరింది. ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో, రిలయన్స్ రిటైల్‌లోకి పెద్ద మొత్తంలో పెట్టుబడులు వచ్చిన విషయం తెలిసిందే. విదేశీ పెట్టుబడులు పెద్ద మొత్తంలో పుంజుకోవడానికి కారణం ముఖేష్ అంబానీ కంపెనీల్లోకి వచ్చిన పెట్టుబడులు దోహదపడ్డాయని చెబుతున్నారు. 
 
డీపీఐఐటీ గణాంకాల ప్రకారం రంగాలవారీగా చూస్తే టాప్ 10లో 17.5 బిలియన్ డాలర్ల పెట్టుబడులతో సాఫ్టువేర్, హార్డ్‌వేర్ రంగాలు ముందున్నాయి. మిగతా 9 రంగాల్లో పెట్టుబడులు తగ్గాయి. రాష్ట్రాలవారీగా చూస్తే గుజరాత్‌కు సగానికి పైగాఎఫ్ డీఐలు వచ్చాయి. ఈ రాష్ట్రానికి 16 బిలియన్ డాలర్లు వచ్చాయి. 
 
ఆ తర్వాత మహారాష్ట్ర ఉండగా, మూడో స్థానంలో కర్ణాటక ఉంది. ఏప్రిల్-సెప్టెంబర్ మధ్య కాలంలో సర్వీసుల రంగానికి 17 శాతం పెట్టుబడులు వచ్చాయి. సర్వీసుల రంగంలో ఫైనాన్షియల్, బ్యాంకింగ్, బీమా, ఔట్ సోర‍్సింగ్ కలసి ఉన్నాయి. ఈ రంగాల్లో కంప్యూటర్ సాఫ్టువేర్, హార్డువేర్ విభాగానికి 12 శాతం ఎఫ్ డీఐలు వచ్చాయి.
 
టెలికం రంగానికి 7 శాతం వచ్చింది. మహారాష్ట్ర 20 శాతం, కర్ణాటక 15 శాతం, ఢిల్లీ 12 శాతం చొప్పున ఎఫ్ డీఐలు వచ్చాయి. కరోనాను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు పలు దేశాల ప్రభుత్వాలు, కేంద్ర బ్యాంకులు ఆర్థిక ప్యాకేజీని ప్రకటించి లిక్విడిటీని పెంచాయి. 
 
ఇదే సమయంలో కరోనా కేసులు తగ్గుతున్నాయి. దీంతో భారత్‌కు విదేశీ పెట్టుబడులు పెరుగుతూ వచ్చాయి. కాంట్రాక్ట్ మ్యాన్యుఫాక్చరింగ్, కోల్ మైనింగ్ తదితర రంగాలు భవిష్యత్తులో మరిన్ని విదేశీ పెట్టుబడుల్ని ఆకట్టుకునే వీలుంది. 
 
దేశంలోఎఫ్ డీఐలకు అనువైన వాతావరణం ఉందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. జూలై-సెప్టెంబర్ కాలంలో 28.1 బిలియన్ డాలర్లకు ఎఫ్ డీఐలు పెరిగాయని చెబుతూ ప్రధాని మోదీపై నమ్మకం వల్ల ఎఫ్ డీఐలు వెల్లువెత్తుతున్నాయని చెప్పారు.