
రైల్వే స్టేషన్లలో ఇక నుంచి ప్లాస్టిక్ కప్పులు కనిపించవు. కుల్హాద్‌గా పిలిచే మట్టి కప్పుల్లో టీ ఇవ్వనున్నట్లు రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. దేశంలోని ప్రతి రైల్వే స్టేషన్‌లో మట్టికప్పుల్లో మాత్రమే టీ విక్రయించేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
రాజస్థాన్ లోని వాయవ్య రైల్వేలో కొత్తగా విద్యుదీకరణ పూర్తి చేసుకున్న ధిగ్వారా-బండికుయి సెక్షన్ ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైల్వే స్టేషన్‌లలో మట్టి కప్పులను వాడటం ద్వారా దేశాన్ని ప్లాస్టిక్ రహితంగా మార్చడానికి భారతీయ రైల్వేలు తమ వంతు పాత్ర పోషిస్తుందని గోయల్ తెలిపారు
ప్రస్తుతం దేశంలోని 400 స్టేషన్లలో మాత్రమే మట్టికప్పుల్లో చాయ్ ఇస్తున్నారని, భవిష్యత్తులో దేశంలోని అన్ని స్టేషన్లలో ఇవే ఏర్పాట్లు చేయడానికి ప్లాన్ చేస్తున్నామని ఆయన చెప్పారు. వీటి వల్ల పర్యావరణానికి మేలు జరగడంతోపాటు లక్షల మందికి ఉపాధి కూడా కలుగుతుందని పీయూష్ గోయల్ పేర్కొన్నారు.
అంతకుముందు మట్టికప్పులో టీ తాగిన ఆయన రుచి అద్భుతంగా ఉందని కొనియాడారు. కేంద్రం ప్రభుత్వం రాజస్థాన్‌లో రైల్వే ప్రాజెక్టులతోపాటు మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇస్తుందని తెలిపారు. గడిచిన ఆరేండ్లలో రాజస్థాన్‌కు అనేక ప్రాజెక్టులు కేటాయించామని వివరించారు.
More Stories
హిందూ సమాజ పునర్జీవనమే ఆర్ఎస్ఎస్ ఎజెండా
జస్టిస్ వర్మను దోషిగా చూపుతున్న నివేదిక!
ఈ నెల 29న సూర్యగ్రహణం