సీట్లు పెంచుకోవడానికి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బిజెపి పోటీ చేయడం లేదని, మేయర్ సీటు గెలుచుకోవడానికే పోటీ చేస్తున్నామని కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ప్రస్తుత ఎన్నికలలో బీజేపీ అభ్యర్థే మేయర్ అవుతాడని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
అలాగే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని, తమ ప్రభుత్వ ఏర్పాటులో కేసీఆర్‌దే కీలక పాత్ర అని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని నడుపుతున్న తీరు చూస్తేనే బీజేపీ విజయం ఖాయమని తెలుస్తుందని ధ్వజమెత్తారు. “నేను ఎన్నికల కోసం వచ్చాను.. కేసీఆర్‌ను కొట్టడానికి కాదు. కేసీఆర్ ఆయురారోగ్యాలతో వందేళ్లు బతకాలి” అంటూ తెలిపారు. రోడ్ షోలో తనకు ఘన స్వాగతం పలికిన హైదరాబాద్ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.
టీఆర్ఎస్, ఎంఐఎం కలిసి హైదరాబాద్‌ను ఐటీ హబ్ కాకుండా అడ్డుకుంటున్నాయని ఆరోపించారు. బీజేపీ ఒక్కసారి అవకాశం ఇస్తే హైదరాబాద్‌ను ప్రపంచ ఐటీ హబ్‌గా మారుస్తామని హామీ ఇచ్చారు. ఎంఐఎం అండతోనే నగరంలో అక్రమ కట్టడాలు ఏర్పాటయ్యాయని, ఎంఐఎం మార్గదర్శనంలోనే టీఆర్ఎస్ నడుస్తోందని ధ్వజమెత్తారు. బీజేపీకి అవకాశమిస్తే.. హైదరాబాద్‌లో అక్రమ కట్టడాలన్నీ కూల్చేస్తామని అమిత్ షా ప్రకటించారు.
హైదరాబాద్ అభివృద్ధికి కేంద్రం నిధులిస్తోందని చెబుతూ సిటీలో వరదలు వచ్చినప్పుడు కేసీఆర్ ఎక్కడున్నారని ప్రశ్నించారు. హైదరాబాద్ నీళ్లలో మునిగినప్పుడు కేసీఆర్ ఎక్కడున్నారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రోడ్ల మీదకు రాలేదు.. ఎమ్మెల్యేలతో మాట్లాడలేదని విమర్శించారు.
సీఎం కేసీఆర్ ఫామ్ హౌజ్ నుంచి బయటకు రావాలని ఆయన హితవు చెప్పారు. కేసీఆర్ ఎవరితోనూ సమావేశం కాలేదని విమర్శించారు. తన ప్రశ్నలకు కేసీఆర్ సమాధానాలు చెప్పాలని డిమాండ్ చేశారు.
‘‘గత ఎన్నికల తర్వాత వంద రోజుల ప్రణాళిక అన్నారు.. ఏమైంది? లక్ష ఇళ్లు కడతామన్నారు.. ఏమైంది? ఇచ్చిన హామీలను టీఆర్ఎస్ నెరవేర్చలేకపోయింది. హుస్సేన్ సాగర్‌ను శుద్ధి చేస్తాం.. పర్యాటక కేంద్రంగా మారుస్తాం అన్నారు. ఏమయ్యాయి అవి. ప్రజలకు ఆయుష్మాన్ భారత్ ఫలాలు అందకుండా అడ్డుకున్నారు’’ అంటూ విమర్శించారు.
అవినీతిలో తెలంగాణ ప్రభుత్వం అన్నిసరిహద్దులు దాటేసింది. ఎంఐఎంతో పొత్తు ఉందో..లేదో చెప్పేందుకు ఎందుకు భయపడుతున్నారు? నేరుగా సీట్లు పంచుకొని పోటీ చేయండి. హైదరాబాద్‌లో రోహింగ్యాలను, బంగ్లాదేశీయులను ఏరివేద్దామనుకుంటే పార్లమెంటులో అడ్డుకున్నది ఎవరు? అంటూ ప్రశ్నించారు.
కేంద్రం ద్వారా హైదరాబాద్ చిరువ్యాపారులకు అత్యధికంగా లాభం జరిగింది.నవాబు, నిజాం సంస్కృతుల నుంచి విముక్తి చేసి..హైదరాబాద్ ఒక మినీ ఇండియాగా తీర్చిదిద్దుతాం’ అని అమిత్ షా పేర్కొన్నారు.
జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారం కోసం హైదరాబాద్‌కు వచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాతబస్తీలోని భాగ్యలక్ష్మి ఆలయానికి చేరుకుని.. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీతాఫల్‌మండి నుంచి రోడ్ షో లో పాల్గొన్నారు. అయితే సమయం లేకపోవడంతో రోడ్‌షోలో ప్రసంగించలేదు. తదుపరి పార్టీ కార్యాలయం వద్ద ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.
హైదరాబాద్‌కు చేరుకున్న అమిత్ షా తెలంగాణ ప్రజల ఆప్యాయత గురించి తెలుగులో ట్వీట్ చేయడం విశేషం. ‘‘హైదరాబాద్ చేరుకున్నాను. తెలంగాణ ప్రజల ఆప్యాయతకు మరియు మద్దతుకు ముగ్దుడనైయ్యాను.’’ అంటూ అమిత్ షా ట్వీట్ చేశారు. అనంతరం భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నాక మరోసారి తెలుగులోనే ట్వీట్ చేశారు.
‘‘హైదరాబాద్ పర్యటన సందర్భంగా భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని సందర్శించుకొని, అమ్మ ఆశీస్సులు అందుకున్నాను. తెలంగాణ ప్రజల శ్రేయస్సు కోసం అమ్మవారిని ప్రత్యేకంగా ప్రార్థించాను. భాగ్యలక్ష్మి అమ్మవారు, దేశ ప్రజలందరికీ కూడా ఆయురారోగ్యాలను, సుఖసంతోషాలను ప్రసాదిస్తుందని నమ్ముతున్నాను.’’ అంటూ రెండో ట్వీట్‌లో అమిత్ షా పేర్కొన్నారు
More Stories
ఇద్దరు పిల్లలు ఉంటేనే స్థానిక సంస్థల్లోపోటీ
చైనా, ఇజ్రాయిల్, మయాన్మార్ ల్లోనే అత్యధికంగా జైళ్లలో జర్నలిస్టులు
బ్రిజేశ్ ట్రిబ్యునల్ ముందు నెగ్గిన తెలంగాణ పంతం