కొత్త చట్టాలతో రైతుల సంకెళ్ళు తెగిపోయాయి

కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలు  రైతుల సంకెళ్ళను తెంచినట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. నెలవారీ రేడియో కార్యక్రమం మన్‌కీ బాత్‌లో ఆయన జాతినుద్దేశించి ప్రసంగిస్తూ నూతన వ్యవసాయ రంగ సంస్కరణలు రైతులకు కొత్త అవకాశాలకు తలుపులు తెరిచాయని చెప్పారు.
 
దేశరాజధాని శివారులో కేంద్రం కొత్తగా తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగిస్తున్న సమయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.  రైతుల కష్టాలను, సమస్యలను తగ్గించే చట్టాలను తాము తీసుకొచ్చామని ప్రధాని పేర్కొన్నారు. మన దేశంలో వ్యవసాయం, దాని అనుబంధ కార్యకలాపాలకు నూతన కోణం ఆవిష్కృతమైందని చెప్పారు. రైతులు ఈ చట్టాలతో సాధికారులయ్యారని తెలిపారు.
దశాబ్దాల నాటి రైతుల డిమాండ్లు, అనేక రాజకీయ పార్టీలు నెరవేరుస్తామని వాగ్ధానం చేశాయని తెలుపుతూ అవి ఇప్పుడు నెరవేరాయని ప్రధాని చెప్పారు. మేధోమధనం తర్వాత పార్లమెంటు వ్యవసాయ సంస్కరణ చట్టాలను ఆమోదించిందని తెలిపారు. ఈ సంస్కరణలు రైతుల సంకెళ్లను ఛేదించడమే కాకుండా కొత్త హక్కులు, అవకాశాలు కల్పించాయని చెప్పారు. వీటితో రైతుల సమస్యలను చాలా త్వరగా తగ్గించడం ప్రారంభించాయని వివరించారు. 
 
 దీనికి ఓ ఉదాహరణను తెలిపారు. మహారాష్ట్రలోని ధూలేలో ఓ రైతు మొక్క జన్న పంటను అమ్ముకుని ఇప్పటి కూడా డబ్బులు పొందలేకపోయాడని చెప్పారు. ఇలా రైతులు ఎదురుచూపులకు చెక్‌ పెడుతూ ఈ చట్టాలను తెచ్చామని,  దీంతో తక్షణ సాయం పొందుతున్నారని తెలిపారు.
 
కొత్త చట్టం ప్రకారం పంట కొనుగోలు పూర్తయిన మూడు రోజుల్లో రైతుల ఖాతాల్లో సొమ్ము జమ కావాలని ప్రధాని స్పష్టం చేశారు. లేని పక్షంలో అన్నదాతలకు ఫిర్యాదు చేసే హక్కు ఉంటుందని తెలిపారు.  ఈ సందర్భంగా మోడీ పలువురు రైతుల చేస్తున్న కృషిని ప్రశంసించారు.
మహ్మద్‌ అస్లాం అనే రైతు తన ప్రాంతంలో ఉన్న రైతులో ఓ వాట్సాప్‌ గ్రూప్‌ సృష్టించి వివిధ రైతు బజార్లలో పంట ఉత్పత్తుల ధరలు వంటి సమాచారాన్ని వారితో పంచుకుంటున్నారని తెలిపారు. ఆయన సొంతంగా కూడా రైతుల పంటల్ని కోనుగోలు చేస్తారు. రైతులు తమ ఉత్పత్తుల్ని ఎక్కడ విక్రయించాలో నిర్ణయించుకునేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతోందని పేర్కొన్నారు.
 
కష్టపడి పని చేసే భారతీయ రైతుల సంక్షేమానికి తన ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని స్పష్టం చేశారు. యువత, వ్యవసాయ విద్యార్థులు తమ సమీపంలోని గ్రామాలకు వెళ్లి, రైతులకు నూతన వ్యవసాయ చట్టాలు, సంస్కరణల గురించి తెలియజేయాలని కోరారు.
ఇదిలా ఉండగా దేశంలో కరోనా పరిస్థితిపై సైతం ప్రధాని ప్రజలను హెచ్చరించారు. వైరస్‌ పట్ల నిర్లక్ష్యం వహించొద్దని, ఇప్పటికీ చాలా ప్రమాదకరమైందని పేర్కొన్నారు.
 అదేవిధంగా అక్రమంగా  దేశం  నుండి తరలివెళ్లిన పురాతన విగ్రహాలు, వస్తువులు తీసుకురావడంలో గత కొన్నేళ్లుగా ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఫలించాయని అన్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న ప్రదర్శన శాలలు, గ్రంథాలయాలు పూర్తిగా డిజిటలీకరణ దిశగా సాగుతున్నాయని ప్రధాని చెప్పారు.
ఈ క్రమంలో ఢిల్లీలోని నేషనల్‌ మ్యూజియం కొన్ని ప్రతిష్టాత్మక చర్యలు చేపట్టిందని తెలిపారు. త్వరలో 10 వర్చువల్‌ గ్యాలరీలు ప్రారంభించే దిశగా సాగుతోందని పేర్కొన్నారు. ప్రపంచ వారసత్వ వారోత్సవాల వంటి ప్రత్యేక రోజులు మన దేశ సంస్కృతిని, వారసత్వ సంపదను అర్థం చేసుకునేందుకు ఎంతో దోహదం చేస్తాయని తెలిపారు.