రోహింగ్యాల ఉనికిపై గ్రేటర్ పోలీసుల అప్రమత్తం 

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బిజెపిని గెలిపిస్తే పాతబస్తీలో టీఆర్ఎస్, ఎంఐఎం అండదండలతో స్థావరాలు ఏర్పరచుకొని, దేశ విద్రోహకార కార్యకలాపాలకు పాల్పడుతున్న రోహింగ్యాలను ఏరిపారవేడంకోసం సర్జికల్ ఆపరేషన్ చేబడతామని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ చేసిన హెచ్చరిక గ్రేటర్ హైదరాబాద్ పోలీసులను అప్రమత్తం చేస్తున్నది.

  ముఖ్యంగా రోహింగ్యాలకు రేషన్ కార్డులు, ఓట్ హక్కులు కల్పిస్తూ వారి ఓట్లతో వీరు గెలుపొందే ప్రయత్నం చేస్తున్నట్లు సంజయ్ చేసిన ఆరోపణలు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆత్మరక్షణలో పడవేశాయి. అందుకనే   పోలీసులు రోహింగ్యాల వద్ద ఉన్న ఓటరు ఐడీలపై ఆరా తీస్తున్నారు.

గ్రేటర్‌ ఎన్నికలు జరుగుతున్న హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ కమిషనరేట్ల పరిధిలోని శిబిరాల్లో ఉన్నవారితోపాటు ఇతర ప్రాంతాల్లో ఉంటున్న రోహింగ్యాల సమాచారం సేకరించి వారి వద్ద ఉన్న గుర్తింపు కార్డులను  పరిశీలిస్తున్నారు. హైదరాబాద్‌లో బాలాపూర్‌, బార్కస్‌, పహాడీషరీఫ్‌ తదితర ప్రాంతాల్లోని శిబిరాల్లో రోహింగ్యాలు తలదాచుకుంటున్నారు.

అధికారిక లెక్కల ప్రకారం నగరంలో 5-6 వేల మంది రోహింగ్యాలు ఉన్నారు. అనధికారికంగా ఉంటున్నవారి సంఖ్య కూడా ఎక్కువగా ఉండవచ్చునని భావిస్తున్నారు.

సుమారు 300 మంది ఈ మధ్యకాలంలో కశ్మీర్‌ నుంచి హైదరాబాద్‌ వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. 

శిబిరాల్లో ఉంటూ వివరాలు నమోదు చేసుకోకుండా, బయోమెట్రిక్‌లో వివరాలు పొందుపర్చనివారు వందల సంఖ్యలో ఉన్నట్లు ఈ మధ్య కాలంలో ప్రత్యేక బృందాలు జరిపిన విచారణలో తేలింది. బాలాపూర్‌, బార్కాస్‌, పహాషీషరీఫ్‌ శిబిరాల్లో ఉంటున్న వారికి యూఎన్‌హెచ్‌ఆర్‌సీ శరణార్థి గుర్తింపు కార్డు ఇస్తుంది. 

ఎప్పుడు వచ్చారు. ఎప్పటి వరకు శిబిరంలో ఉండాలనే గడువు కార్డుపై ఉంటుంది. చాలా మంది తమ కార్డుపై ఉన్న గడువు ముగియడానికి కొంత సమయం ముందే రెన్యువల్‌ చేయించుకుంటున్నారు. 

గ్రేటర్‌ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ పార్టీ ఆరోపిస్తున్నట్లుగా ఎవరైనా రోహింగ్యాలు ఓటింగ్‌లో పాల్గొని ఓటు వేస్తే అలాంటి వారిని పోలింగ్‌ కేంద్రాల వద్ద ఉండే ఏజెంట్లు గుర్తిస్తే శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందని పోలీసులు ఆందోళలన చెందుతున్నారు. 

దీంతో అప్రమత్తమైన మూడు కమిషనరేట్ల అధికారులు నకిలీ గుర్తింపు కార్డులతో ఓటరు ఐడీ కలిగి ఉన్న రోహింగ్యాలను గుర్తించే పనిలో పడ్డారు. ఇందుకోసం ప్రత్యేక బృందాల్ని ఉన్నతాధికారులు రంగంలోకి దింపారు. అక్రమంగా ఓటరు కార్డు కలిగిన పలువురు రోహింగ్యాలను గుర్తించి వారి వద్ద ఉన్న ఓటరు కార్డులను స్వాధీనం చేసుకున్నారు. 

ఇంకా ఎంత మంది వద్ద ఓటరు కార్డులు ఉన్నాయనేదానిపైనా అధికారులు సమాచారం సేకరిస్తున్నారు. ట్రై కమిషనరేట్లతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన నేరాల్లో రోహింగ్యాలు నిందితులుగా ఉన్నారు. వారిలో చాలా మంది ఇప్పటి వరకు వాంటెడ్‌లుగా ఉన్నారు.

రోహింగ్యాలపై ఇప్పటికే చాలా కేసులు ఉన్నాయని డీజీపీ మహేందర్‌ రెడ్డి స్వయంగా వెల్లడించారు. తప్పుడు సమాచారంతో ఓటర్‌ ఐడీ, ఆధార్‌, ఇతర గుర్తింపు కార్డులు పొందడం వంటివి చేశారని వారిపై కేసులు నమోదు చేశారు. నకిలీ గుర్తింపు కార్డులు, ఇతర నేరాలకు సంబంధించి  రోహింగ్యాలపై 62 కేసులు నమోదయ్యాయి. ఇందులో చాలా కేసుల్లో న్యాయస్థానాల్లో నేరం రుజువై శిక్షలు కూడా పడ్డాయి. మరెన్నో కేసులు విచారణలో ఉన్నాయి.