అత్యవసర వినియోగం కింద కోవీషీల్డ్‌ టీకా

అత్యవసర వినియోగం కింద కోవీషీల్డ్‌ టీకాను అనుమతించాలని రెండు వారాల్లో కేంద్రాన్ని అభ్యర్థించనున్నట్లు సీరం ఇన్‌స్టిట్యూట్‌ సిఇఒ అదర్‌ పూనావాలా వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ ప్రకటన చేశారు. 

ఎన్ని మోతాదులను కొనుగోలు చేస్తారనే అంశంపై ప్రభుత్వం నుండి స్పష్టమైన సమాచారం అందలేదని, కాని వచ్చే ఏడాది జులై నాటికి 300-400 మిలియన్‌ మోతాదులు ఉండవచ్చని అయన పేర్కొన్నారు. టీకా సమర్థత, భద్రత గురించి మాట్లాడుతూ.. క్లినికల్‌ ట్రయల్స్‌లో వైరస్‌ను సమర్థవంతంగా ఎదుర్కొన్నట్లు స్పష్టమైందని తెలిపారు. 

తమ వ్యాక్సిన్‌ 70 సమర్థతతో అత్యంత ప్రభావవంతమైందిగా తేలిందని చెప్పారు. భారతదేశంలో కోవిషీల్డ్‌గా పిలుస్తున్నఈ టీకా ప్రస్తుతం మూడవ దశ క్లినికల్ ట్రయల్స్‌లో ఉంది.  ఈ సందర్భంగా సీరం సీఈవో ప్రధాని మోదీపై ప్రశంసలు కురిపించారు. 

వ్యాక్సిన్లు, వ్యాక్సిన్ ఉత్పత్తిపై  ప్రధాని పరిజ్ఞానాన్ని చూసి తామే ఆశ్చర్యపోయామని పూనవల్లా వ్యాఖ్యానించారు. వివిధ రకాల వ్యాక్సిన్లు, ఎదుర్కొనే సవాళ్లు తప్ప, తాము ఆయనకి వివరించిందేమీ లేదని తెలిపారు. వ్యాక్సిన్‌ పంపిణీ ప్రక్రియ అమలు ప్రణాళికపై ప్రధానితో చర్చించామని పేర్కొన్నారు.

మరోవైపు సీరం కేంద్రాన్ని పరిశీలించిన అనంతరం ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు. సీరం బృందంతో మంచి చర్చలు జరిగాయనీ, ఇప్పటివరకు జరిగిన కృషి, భవిష్యత్‌ పురోగతిపై వివరాలను వారు షేర్‌ చేశారని మోదీ తెలిపారు. నెలకు 50 నుండి 60 మిలియన్‌ల మోతాదులను ఉత్పత్తి చేస్తున్నామని, జనవరి అనంతరం వంద మిలియన్‌ డోసులను ఉత్పత్తి చేస్తామని చెప్పారు. 

కాగా ప్రధాని మోదీ వ్యాక్సిన్‌ టూర్‌లో భాగంగా హైదరాబాద్‌లోని భారత్ బయోటిక్, అహ్మదాబాద్‌లోని జైడస్ బయోటిక్ పార్క్, పూణేలోని సీరం ఇనిస్టిట్యూట్‌ను శనివారం సందర్శించారు. మొదట గుజరాత్‌లోని ఫార్మా మేజర్ జైడస్ కాడిలా ప్లాంట్‌కు, ఆతరువాత కోవాక్సిన్‌ను ఉత్పత్తిచేస్తున్న హైదరాబాద్‌లోని భారత్ బయోటెక్‌  కేంద్రానికి, చివరగా పూణేకు వెళ్లిన సంగతి తెలిసిందే.