ప్రజలు సహకరిస్తే హైదరాబాద్‌కు భాగ్యనగరంగా పేరు మారుస్తామని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గ్రేటర్ ప్రజలకు హామీ ఇచ్చారు. ‘‘యూపీలో బీజేపీ సర్కారు వచ్చాక.. ఫైజాబాద్ పేరును అయోధ్యగా.. అలహాబాద్‌ను ప్రయాగ్‌రాజ్‌గా మార్చాం. అలాంటప్పుడు హైదరాబాద్ పేరును భాగ్యనగరంగా మార్చడం కూడా సాధ్యమే. నగర ప్రజలు బీజేపీని ఆదరిస్తే.. అది సాధ్యమే అవుతుంది. భాగ్యం అంటే అభివదిఇ్ధకి చిహ్నం’’ అని చెప్పారు.
నియంతలా వ్యవహరిస్తున్న కేసీఆర్ అవినీతి పాలన అంతం కావాలంటే ప్రజలు బీజేపీని గెలిపించాలని ఆయన పిలుపిచ్చారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారం కోసం ఆయన శనివారం నగరంలోని శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, చార్మినార్ తదితర ప్రాంతాల్లో పర్యటించారు. ఆల్విన్ కాలనీ, పాతబస్తీ లాల్‌దర్వాజా ప్రాంతాల్లో నిర్వహించిన సభల్లో యోగి ప్రసంగించారు.
నిజాం నిరంకుశ పాలనకు చరమగీతం పాడినట్లుగానే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ప్రజలు మజ్లిస్, టీఆర్‌ఎస్ పార్టీలను ఓడించాలని ఆయన కోరారు. తెలంగాణలో ఆరేళ్లుగా ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా పాలన జరుగుతోందని ధ్వజమెత్తారు. ప్రాజెక్టుల నిర్మాణంలో కూడా విచ్చలవిడిగా అవినీతి చోటుచేసుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజాం వారసత్వ పాలనకు గ్రేటర్ ఎన్నికల నుంచే చరమగీతం పలకాలని పిలుపునిచ్చారు.
యూపీలో 10 కోట్ల మంది ప్రజలకు ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అందిస్తున్నామనీ, తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో ఎందుకు అమలు చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. మజ్లిస్, టీఆర్‌ఎస్ పార్టీలు, వారి కుటుంబాల అభివృద్ధికే తప్ప ప్రజలకు చేసిన మేలేం లేదని ధ్వజమెత్తారు.
‘‘దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం వచ్చినా.. హైదరాబాద్ సంస్థానాన్ని పాకిస్థాన్‌లో విలీనం చేయడానికి అప్పటి నిజాం ప్రయత్నించాడు. రజాకార్ల అకృత్యాలను సర్దార్ పటేల్ అడ్డుకుని, హైదరాబాద్‌ను భారత్‌లో విలీనం చేశారు. ఇప్పటికీ నిజాం వారసులు అభివృద్ధిని అడ్డుకుంటున్నారు’’ అని ఉద్వేగంగా విమర్శించారు.
నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన గడ్డ తెలంగాణ అని.. అలాంటి తెలంగాణ అభివృద్ధిని ఓ కుటుంబం, దాని మిత్రుడు కలిసి అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో కుటుంబ పాలనకు తావులేదని స్పష్టం చేశారు. ‘‘హిందుస్థాన్ అని పలకడానికి ఇష్టపడని ఓ మజ్లిస్ ఎమ్మెల్యే బిహార్‌లో ఉన్నాడు. ఇదీ మజ్లిస్ విధానం’’ అంటూ.. ఎంఐఎంపై మండిపడ్డారు.
నాలుగువందల ఏళ్లుగా పరిష్కారానికి నోచని అయోధ్య వివాదానికి ప్రధాని మోదీ నేతృత్వంలో అద్భుతమైన పరిష్కారం లభించిందని చెబుతూ రామమందిర నిర్మాణం త్వరలోనే సాకారమవుతుందని ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి ప్రజలు తిరిగి పట్టం కట్టారని చెప్పారు.
More Stories
మంత్రులతో కలిసి త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు
భార్యతో సెల్ఫీతోనే మావోయిస్టు చలపతి హతం!
పుష్ప 2 డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో ఐటీ దాడులు