ఈసీ కార్యాలయం ఎదుట బీజేపీ ధర్నా… మంత్రి ఉన్న ఇంటి ముట్టడి 

 తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయం ఎదుట బీజేపీ నేతలు ధర్నా చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమంలో రఘునందన్‌రావు, రామచంద్రారావు, ఇంద్రసేనారెడ్డి తదితరులు పాల్గొన్నారు. టీఆర్‌ఎస్‌ నేతలు డబ్బులు పంచుతున్నా.. పోలీసులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రేటర్‌ ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించాలని వారు డిమాండ్‌ చేశారు. 
 
టీఆర్‌ఎస్‌ పార్టీ డబ్బులు, మద్యం విచ్చలవిడిగా పంచినా వారిపై కేసులు నమోదు చేయడం లేదని రఘునందన్ రావు అన్నారు. టీఆర్‌ఎస్‌ ఆగడాలపై ప్రశ్నించిన తమపై కేసులు నమోదు చేసి దాడులు చేస్తున్నారని ఆయన తీవ్రంగా ఆరోపించారు. 
 టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్న పోలీసులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.  ఎన్నికల సంఘం, సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో పోలీసులు బీజేపీ నేతలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
 
ఇలా ఉండగా, మాన్సూరాబాద్ డివిజన్‌లో మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఉన్న ఇంటిని బీజేపీ కార్యకర్తలు ముట్టడించారు. డివిజన్ నుంచి వెళ్లిపోవాలంటూ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. 
 
సూర్యాపేట నుంచి వచ్చిన వాళ్ల వెంటనే వెళ్లిపోయి, ప్రజాస్వామ్యాన్ని కాపాడలంటూ ఎమ్మెల్యే  సుధీర్ రెడ్డి, మంత్రి జగదీశ్వర్ రెడ్డిలతో పాటు తెరాస నాయకులు అక్కడి నుంచి వెళ్లిపోవాలని బీజేపీ అభ్యర్థి కొప్పుల నరసింహరెడ్డి డిమాండ్ చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అక్కడినుండి మంత్రి జగదీశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి వెనుదిరిగారు.
 
కాగా,  టీఆర్ఎస్ నేతలు బహిరంగంగా డబ్బులు పంపిణీ చేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు. టీఆర్ఎస్ నేతలు డబ్బులు పంచుతుంటే అడ్డుకున్న బీజేపీ కార్యకర్తలపైనే లాఠీచార్జ్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. పోలీసులు టీఆర్ఎస్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. 
 
డబ్బులు పంచుతున్నవారిపై పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. ఓటు కోసం రూ.500 తీసుకుంటే.. ఐదేళ్లు గులాంగిరి చేయాలని రాజాసింగ్ ఈ సందర్భంగా  నగర ఓటర్లను హెచ్చరించారు. 
 
మరోవంక,  చైతన్యపురిలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఓటర్లకు మద్యం పంపిణీ చేస్తున్న టీఆర్‌ఎస్‌ నేతలను బీజేపీ నేతలు అడ్డుకున్నారు. ఆగ్రహంతో బీజేపీ ఆఫీసును టీఆర్‌ఎస్‌ నేతలు ముట్టడించారు. 
 
దాంతో టీఆర్‌ఎస్‌, బీజేపీ నేతల మధ్య తోపులాట చోటుచేసుకోవడంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు. ఈ ఘటనలో పలువురు బీజేపీ కార్యకర్తలు గాయపడ్డారు.