రైతులు ఊహించిన దానికంటే ఎక్కువ మద్దతు ధర  

రైతులు ఊహించిన దానికంటే ఎక్కువ మద్దతు ధర అందిస్తానని ప్రధాని నరేంద్ర మోదీ రైతులకు మాటిచ్చారు. వారణాసిలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోదీ రైతులనుద్దేసించి ప్రసంగిస్తూ సరికొత్తగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టం వారికి మరింత సహకరిస్తుందని హామీ ఇచ్చారు. 
 
‘మీకు మాటిస్తున్నా.. స్వామినాథన్ ఆయోగ్ చెప్పినదానికంటే ఒకటిన్నర రెట్లు అధికమైన కనీస మద్దతు ధర ప్రతి రైతుకూ అందేలా చూస్తాను. ఈ మాట కేవలం కాగితాలకే పరిమితం కానివ్వను. కచ్చితంగా అమలయ్యేలా చేస్తాను. మీ ఖాతాల్లో నగదు జమ అయ్యే వరకు నాది బాధ్యత’ అంటూ మోదీ పేర్కొన్నారు.   
 
ఇన్నాళ్లూ చిన్ని మార్కెట్లకు పరిమితమైన రైతులకు ఇప్పుడు దేశ వ్యాప్తంగా మార్కెట్ కల్పించేందుకు ఈ చట్టాలు ఉపయోగపడతాయని, ఒకవేళ ఎవరైనా పాత విధానంలోనే లావాదేవీలు జరపాలనుకున్నా వారిపై ఎలాంటి ఒత్తిడి లేదని మోదీ చెప్పారు.
 
‘కొత్త చట్టాలు రైతులకు చట్టబద్ధమైన సంరక్షణ లభిస్తుంది. మార్కెట్ బయట జరిగే అక్రమ లావాదేవీలను నిలువరించడమే ఈ చట్టాల ముఖ్య ఉద్దేశం. దీనివల్ల చిన్న రైతులు కూడా అక్రమ లావాదేవీలపై ఫిర్యాదు చేయవచ్చు. దీనివల్ల వారు మోసాలకు గురి కాకుండా ఉంటారు’ అంటూ తెలిపారు. 
 
ప్రభుత్వం చట్టాలు చేసి.. వాటిని అమలు చేస్తుంది. అయితే వాటిని సమర్థించే వారితో పాటు వ్యతిరేకించేవారు కూడా ఉంటారు. భారత్‌లో మాత్రమే కాదు.. ప్రజాస్వామ్య దేశాల్నింటిలో ఇది సర్వసాధారణం. అయితే కొద్ది కాలంగా ఇందుకు భిన్నంగా సాగుతోందని ప్రధాని విచారం వ్యక్తం చేశారు. 
 
 ఒకప్పుడు ప్రభుత్వ నిర్ణయాలు నచ్చని వారు స్వయంగా వాటిపై పోరాడేవారు. కానీ ఇప్పుడు వెనకనుంచి ప్రజలను రెచ్చగొడుతున్నారని ప్రధాని పరోక్షంగా ప్రతిపక్షాలపై విరుచుకు పడ్డారు. వారిలో భయాందోళనలు కలిగించి ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచడమే ధ్యేయంగా పన్నాగాలు పన్నుతున్నారని ధ్వజమెత్తారు. 
 
ప్రభుత్వ నిర్ణయాల వల్ల అలా జరుగుతుంది. ఇలా జరుగుతుంది అంటూ ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నారని ప్రధాని విమర్శించారు. ఇంతవరకు జరగకపోయినా.. ఇకముందు జరగే అవకాశం లేకపోయినా.. అలాంటి దినిపై రచ్చ చేస్తున్నారని ప్రధాని మండిపడ్డారు. రైతు బిల్లుల విషయంలో కూడా ప్రస్తుతం ఇదే జరుగుతోందని చెప్పారు. 
 
విచిత్రంమేంటంటే ఇప్పుడు ఇప్పుడుబురద జల్లుతున్నవారే దశాబ్దాల పాటు దేశాన్ని, రైతులను భ్రష్టు పట్టించారని ప్రధాని మోదీ మండిపడ్డారు. ఎంఎస్‌పీ ద్వారా రైతులకు అతి తక్కువ ధర లభిస్తుందని, దీనిని అడ్డం పెట్టుకుని రైతులను ఏళ్లుగా మోసం చేస్తున్నారని మోదీ ఆరోపించారు.
రైతు రుణ మాఫీ పేరుతో అక్కడి ప్రభుత్వాలు పెద్ద పెద్ద ప్యాకేజీలు ప్రకటించేవని, కానీ ఆ ప్రతిఫలాలు కింది స్థాయి రైతులకు అందేవి కాదని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. రుణ మాఫీలతో కూడా రైతులు తీవ్రంగా మోసపోయారనే విషయం దీంతో అర్థమైపోతోందని చెప్పుకొచ్చారు.
రైతులకు ప్రకటించిన వందల కోట్ల పథకాలు ప్రకటిస్తే వారికి కేవలం 15 పైసల వంతే చేరుతుందని, అంటే పథకాల్లో కూడా రైతులు మోసపోతున్నారని మోదీ పేర్కొన్నారు. ఎప్పుడైతే గతం మొత్తం మోసాలతో నిండిపోయి ఉంటుందో అప్పుడు ఆ మోసానికి గురైన వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తడంలో తప్పులేదని తెలిపారు. అలాగే దశాబ్దాలుగా మోసం చేసిన వారు అసత్యాలతో తమ తప్పులను కప్పిపుచ్చుకోవడంలో విశేషమేమీ లేదని ప్రధాని మోదీ ఎద్దేవా చేశారు.