కేసీర్ అవినీతి అంతంకు ఎంతదూరమైనా వస్తాం 

తెలంగాణాలో కేసీఆర్‌ కుటుంబ, అవినీతి పాలనను అంతం చేయడానికి ఎంత దూరమైనా, ఏ గల్లీకైనా వస్తామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్పష్టం చేశారు. తెలంగాణలో కేసీఆర్ కుటుంభం, ఎంఐఎం నేతలదే రాజ్యమా అని ప్రశ్నించారు. అధికారం కోసం రజాకార్ల వారసులను కౌగిలించుకుంటవా కేసీఆర్ అని నిలదీశారు. 

శుక్రవారం తాజ్‌ బంజారాలో జరిగిన మేధావుల సమావేశంలో నడ్డా ముఖ్యఅతిథిగా మాట్లాడుతూ.. ‘‘కేంద్రం నిధులు ఇస్తే అవినీతికి పాల్పడుతున్నాడు. గల్లీ ఎన్నికలకు జాతీయ నేతలు ఎందుకు వస్తున్నారని కేసీఆర్ ఆగమైతున్నాడు. హైదరాబాద్ గల్లీ కాదు మహానగరం. 74 లక్షల మంది ఓటర్లు.. 5 లోక్‌సభ స్థానాలు.. 24 అసెంబ్లీ స్థానాలు ఉన్న సిటీ గల్లీలా కనబడుతోందా? ఇదేనా ప్రజాస్వామ్యం?” అని ప్రశ్నించారు. 

‘‘కేసీఆర్‌, ఆయన కుటుంభం, కొడుకు, కూతురు, అల్లుడు, ఆయన స్నేయుతులైన ఎంఐఎం నేతలదే రాజ్యమా. అసదుద్దీన్ ఒవైసీ కూడా జోర్‌దార్‌ ఉన్నడు. 1947 ఆగస్టు 15 నుంచి 1948 సెప్టెంబరు 17 దాకా రజాకార్లు ఏం చేశారో గుర్తు చేసుకో కేసీఆర్‌‌. ఇప్పుడు ఆ రజాకార్ల వారసులను కౌగిలించుకుంటున్నవ్” అని విమర్శించారు.

లీడర్ ప్రజల ఆస్తులకు రక్షకుడిగా ఉండాలి కానీ స్వాహా చేసేలా ఉండకూడదని ధ్వజమెత్తారు. అవినీతిని అంతం చేయడానికి, సుపరిపాలన అందించడానికి ఎక్కడికైనా, ఎంత దూరమైనా వస్తామని స్పష్టం చేశారు. ఎయిమ్స్‌‌, మెట్రోకు కేంద్ర ప్రభుత్వం నిధులు  అందించిందని, రాష్ట్రంలో పథకాలకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తోందని చెప్పారు.

కానీ కేంద్ర సంక్షేమ పథకాల లబ్ధిని తెలంగాణ ప్రజలకు అందనీయడం లేదని టీఆర్ఎస్​పై మండిపడ్డారు. 26 లక్షల మందికి ఆయుష్మాన్ భారత్ అందకుండా కేసీఆర్ చేశారని ఆరోపించారు. ప్రజలకు సంక్షేమ ఫలాలు అందాలంటే రాష్ట్రంలో అధికార మార్పిడి జరగాలని పిలుపిచ్చారు. హైదరాబాద్ మార్పుకు మేధావులు నాంది పలకాలని కోరారు.

కేసీఆర్‌‌ కుటుంబ పాలనను అంతం చేయడానికి బయటికి రావాలని పిలుపునిచ్చారు. గ్రేటర్‌‌ ఎన్నికల్లో బీజేపీకి భారీ విజయం అందించాలని కోరారు. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో దేశం అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందని, అందుకే మద్దతు పలికేందుకు ప్రజలు ముందుకొస్తున్నారని తెలిపారు. బీహార్‌‌లో గెలిచామని, ఇప్పుడు తెలంగాణలోనూ గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.

కేసీఆర్ మాదిరిగా తాము హామీలను మరిచిపోబోమని జేపీ నడ్డా చెప్పారు. రాజకీయాలను ప్రధాని మోడీ మార్చేశారని, అభివృద్ధి రిపోర్ట్‌‌తో ఎన్నికలకు పోతున్నారని తెలిపారు. ఐదేళ్ల క్రితం బీహార్‌‌లో ఇచ్చిన హామీలను మోడీ అమలు చేశారని గుర్తు చేశారు. ప్రజల కోసం బీజేపీ పని చేస్తుందని, అందుకే ప్రజలు తమ పార్టీకి పట్టం కడుతున్నారని తెలిపారు.

కరోనా కట్టడిలో భాగంగా లాక్​డౌన్ టైంలో 130 కోట్ల మందిని మోడీ రక్షించారని నడ్డా తెలిపారు. 6 లక్షల మంది మహిళలకు 3 గ్యాస్‌‌ సిలిండర్ల చొప్పున, 20 కోట్ల మందికి రూ.500 చొప్పున, 5 కిలోల బియ్యం, కిలో కందిపప్పు అందించారని తెలిపారు. దివ్యాంగులకు రూ.వెయ్యి అందించారని చెప్పారు. వోకల్‌‌ ఫర్‌‌ లోకల్‌‌ కోసం పని చేస్తున్నామని, పోచంపల్లి హ్యాండ్‌‌ల్యూమ్‌‌ వంటి ఉత్పత్తులను విశ్వవ్యాప్తం చేస్తున్నామని అన్నారు. ‘

‘2014లో స్వచ్ఛ్‌‌ భారత్‌‌ అనేది ఓ ఇష్యూనా అని అన్నారు. కానీ మేం 11 కోట్ల  టాయ్‌‌లెట్స్‌‌ కట్టించాం. తెలంగాణలో 29 లక్షల టాయిలెట్ లను  ‌‌ కట్టించాం” అని చెప్పారు. తెలంగాణకు రూ.1,028 కోట్లతో ఎయిమ్స్‌‌ హాస్పిటల్‌‌, సైనిక్‌‌ స్కూల్‌‌ మంజూరు చేశామని వివరించారు. ‘‘సామాన్యుడు మోడీ.. ప్రధాన మంత్రి అయ్యారు. సామాన్యుడు బండి సంజయ్.. బీజేపీకి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు అయ్యారు. ఇతర పార్టీల్లో ఇది సాధ్యమా? ప్రజలు, మేధావులు ఆలోచించాలి” అని చెప్పారు.

‘‘ఫాంహౌస్‌ నుంచి బయటకు రాని ముఖ్యమంత్రి కేసీఆర్‌.. రోల్‌మోడల్‌ ఎలా అవుతారు? రోల్‌మోడల్‌గా ఉండే నాయకుడు ప్రజల ముందుకు వెళ్లాలి. ప్రధాని నరేంద్రమోదీ లడ్డాఖ్‌ వెళ్లి.. సైనికులను ఎలా ప్రోత్సహించారో చూడండి. కరోనా నియంత్రణకు ముందుండి దేశాన్ని నడిపారు’’ అంటూ అంతకు ముందు రోడ్ షో లో తెలిపారు.