అవినీతితో లక్ష కోట్ల రూ వెనకేసుకున్న కేసీఆర్ 

సీఎం కేసీఆర్ అవినీతితో లక్ష కోట్లు వెనకేసుకున్నారని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆరోపించారు. బీజేపీ వస్తే మత కలహాలు వస్తాయని కేటీఆర్ అంటున్నారని, మరి భైంసా బాధితులను ఆయన పలకరించారా అని ప్రశ్నించారు.

రామచంద్రాపురంలో బీజేపీ నిర్వహించిన జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో అర్వింద్ పాల్గొంటూ హైదరాబాద్‌‌లో వరదలు వచ్చినప్పుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నగరంలో పర్యటించారని, ఆయన సూచనల మేరకే కేంద్రం రూ.440 కోట్లను హైదరాబాద్‌‌కు పంపిందని తెలిపారు. అదే వరదల సమయంలో కేసీఆర్ హైదరాబాద్‌‌కు రాలేదని గుర్తు చేశారు. 

కేంద్రం పంపిన డబ్బుల్లో రూ.250 కోట్లను కల్వకుంట్ల కుటుంబం కొట్టేసి,  మిగిలిన డబ్బులను టీఆర్ఎస్ కార్యకర్తలకు పంచింది ధ్వజమెత్తారు. ‘టీఆర్ఎస్ అవినీతి సొమ్మును జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పంచుతోంది. కేసీఆర్ నుంచి కార్పొరేటర్ దాకా ప్రజల డబ్బులను దోచుకున్నారు’ అని విమర్శించారు

బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థులను గెలిపిస్తే వరద సాయం కింద రూ.25 వేలు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. ప్రజల సొమ్మును కేసీఆర్ కుటుంబం మింగేస్తోందని అంటూ బందిపోట్ల కంటే కేసీఆరే ఎక్కువ సంపాదిస్తున్నారని దుయ్యబట్టారు.  అదే మోడీ ఏడేళ్ల పాలనలో దేశంలో ఒక్క స్కామ్ కూడా జరగలేదని స్పష్టం చేశారు.

ప్రధాని మోదీకి మద్దతుగా హైదరాబాద్ ప్రజలు నిలిచి కుల, మతాలకు అతీతంగా ఓటేయాలని పిలుపిచ్చారు. బీజేపీలో అవినీతికి ఆస్కారం లేదని స్పష్టం చేస్తూ కేసీఆర్ అవినీతిలో ఒవైసీకీ కమీషన్ ఉందని ధ్వజమెత్తారు.