సువెందు రాజీనామాతో మమతా పతనం ప్రారంభం 

రాష్ట్ర  రవాణా మంత్రి, సీనియర్ నాయకుడు సువేందు అధికారి రాజీనామాను స్వాగతీస్తూ ఆయనతో పశ్చిమ బెంగాల్ లో టీఎంసీ ముగింపు ప్రారంభమైందని  మాజీ టీఎంసీ నేత,  బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు ముకుల్‌ రాయ్‌ స్పష్టం చేశారు. 

ఆయన బీజేపీలో చేరితే పార్టీకి, ఆయనకు ప్రయోజనకరంగా ఉంటుందని హితవు చెప్పారు. ఆయన రాజీనామా చేసిన కొన్ని గంటలకే ఆయన స్పందించారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి ఎన్నికలు వచ్చే ఏడాది ఏప్రిల్-మేలో జరిగే అవకాశం ఉందన్న అంచనాల మధ్య రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టేందుకు బీజేపీ ఉవ్విళ్లూరుతోంది.

అటు అధికారాన్నికాపాడుకునేందుకు తృణమూల్ కాంగ్రెస్‌ (టీఎంసీ) శతవిధాలా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో పార్టీలో  రగులుతున్న అసమ్మతి సెగలు, రాజీనామాలతో టీఎంసీ కష్టాల్లో కూరుకుపోతోంది.

మరోవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు  దిలీప్ ఘోష్ స్పందిస్తూ సువేందు అధికారికి బీజేపీ ద్వారాలు తెరిచే ఉన్నాయని పేర్కొన్నారు. అధికార పార్టీ తీరు పట్ల  మరికొంతమంది నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారనీ, వారికి కూడా బీజేపీలోకి ఆహ్వానం పలుకుతున్నామని ప్రకటించారు. 

సువెంద్‌ రాజీనామా టీఎంసీ పతనానికి సంకేతమనీ, ఇక ఆ పార్టీ  తెరమరుగవ్వడం ఖాయమని స్పష్టం చేశారు. అంతేకాదు “ఈ రోజు పెద్ద వికెట్ పడిపోయింది” ఇక ఆత్మగౌరవమున్న నాయకులంతా టీఎంసీకి గుడ్‌బై చెబుతారని ఘోష్ జోస్యం చెప్పారు. 

అదొక మునిగిపోతున్న ఓడ, అందులో  కెప్టెన్ మినహా ఎవరూ ఎవ్వరూ ఉండరని పేర్కొన్నారు. 2019 (లోక్సభ ఎన్నికలు) బీజేపీకి సెమీ ఫైనల్. తామిపుడు  202 (అసెంబ్లీ ఎన్నికలు) లో ప్రధాన లక్ష్యానికి ముందుకుపోతున్నాం.. సువెందు అధికారి తమ పార్టీలోచేరితే ఇది మరింత ఊపందుకుంటుదని తెలిపారు.