‘‘ధరణి” ‌ పోర్టల్‌‌లో డేటా భద్రతపై అనుమానాలు

కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాకరంగా చేపట్టిన ‘‘ధరణి” వెబ్‌‌ పోర్టల్‌‌లో నమోదు చేసిన సమాచారానికి భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.  మంత్రులు, ఉన్నతాధికారుల డేటానే హ్యాకింగ్‌‌  అవుతుంటే ధరణిలో డేటా భద్రంగా ఉంటుందని ప్రభుత్వం ఏవిధంగా చెబుతోందని ఆందోళనలు కలుగుతున్నాయి. 

కేంద్రం ఆధీనంలోని ఆధార్‌‌ డేటానే మూడుసార్లు బయటికొచ్చిందని రాష్ట్ర సర్కారుకు తెలియదా? అని హైకోర్టు నిలదీసింది. ఇప్పటివరకు ధరణి పోర్టల్‌‌లో నమోదైన డేటాను ఎక్కడ స్టోర్​ చేశారని, దానిని ఎవరు పర్యవేక్షిస్తున్నరో చెప్పాలని అడిగింది. సంబంధిత ఉన్నతాధికారి దగ్గరి నుంచో, ఆ ఆఫీసు నుంచో డేటా బయటికిపోదని గ్యారెంటీ ఏమిటని ప్రశ్నించింది.

ధరణిలో ఆధార్‌‌తోపాటు కులం, ఫోన్‌‌ నంబర్‌‌ వంటి వ్యక్తిగత వివరాలు నమోదు చేయడం చట్టవిరుద్ధమని పేర్కొంటూ న్యాయవాది ఐ.గోపాల్‌‌శర్మ, కాశీభట్ల సాకేత్, కె.ఆనంద్‌‌కుమార్‌‌లు వేర్వేరుగా వేసిన పిల్స్‌‌ను బుధవారం చీఫ్‌‌ జస్టిస్‌‌ ఆర్‌‌ఎస్‌‌ చౌహాన్, జస్టిస్‌‌ బి.విజయ్‌‌సేన్‌‌రెడ్డిల ధర్మాసనం మరోసారి విచారించింది. 

నాన్​ అగ్రికల్చరల్​ ఆస్తుల వివరాలు నమోదు చేయరాదంటూ ఇచ్చిన స్టేను రద్దు చేయాలన్న అడ్వొకేట్​ జనరల్​ బీఎస్‌‌ ప్రసాద్‌‌ చేసిన విజ్ఞప్తిని తోసిపుచ్చింది. పిల్స్‌‌పై విచారణను డిసెంబర్‌‌ 3కి వాయిదా వేస్తున్నామని, అప్పటివరకు స్టే కొనసాగుతుందని స్పష్టం చేసింది.

ఒకేసారి రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు చేయడం వల్ల జనం సంతోషిస్తారని, ధరణిలో వివరాలు నమోదు చేయకుంటే రిజిస్ట్రేషన్లు చేయబోమని రాష్ట్ర సర్కారు చెప్పడం రాజ్యాంగంలోని 300 ఆర్టికల్​కు వ్యతిరేకమని హైకోర్టు పేర్కొంది.ధరణిలో డేటా లీక్‌‌ కాదని ప్రభుత్వం గ్యారెంటీ ఏమిస్తుందని ప్రశ్నించింది.

ధరణిలో డేటాను తహసీల్దార్, పటేల్, పట్వారీలు సేకరించినంత మాత్రాన భద్రంగా ఉంటుందని అనుకోనవసరం లేదని అభిప్రాయపడింది. ఆధార్‌‌ డేటానే మూడుసార్లు లీకైందని గుర్తు చేసింది.

ఈ సందర్భంగా సర్కారు తరఫున ఏజీ బీఎస్​ ప్రసాద్​ కల్పించుకుని డేటా హ్యాకింగ్‌‌ అవుతుందని వివరాలు సేకరించ వద్దనడం సరికాదని.. డిజిటలైజేషన్‌‌ జరిగితే ఆస్తులపై ఆదాయం పెరుగుతుందని, సంక్షేమ పథకాలు దుర్వినియోగం కాకుండా చేయొచ్చని చెప్పారు. ఇప్పటివరకు 30 వేల వ్యవసాయ భూముల లావాదేవీలు జరిగితే ఒక్క పొరపాటు కూడా జరగలేదని, నాన్‌‌ అగ్రికల్చర్‌‌  రిజిస్ట్రేషన్ల విషయంలోనూ ఇదే జరుగుతుందని పేర్కొన్నారు.